ఈ ఏడాది ఇస్రో 7 ప్రయోగాలు

ఈ ఏడాది ఇస్రో 7 ప్రయోగాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రయోగాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ శనివారం ప్రకటించారు. రానున్న రెండు నెలల్లోగా తదుపరి మిషన్‌ను ప్రయోగించనున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు ఉపగ్రహాల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మరో 5-6 ఆరు ఉపగ్రహాల నిర్మాణం తుది దశలో ఉందని వెల్లడించారు.

అంతరిక్ష సంస్థ రాబోయే కార్యాచరణ షెడ్యూల్‌లో, ప్రణాళిక చేసిన ఉపగ్రహ ప్రయోగాలతో పాటు, గగన్‌యాన్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం కింద మొదటి మానవరహిత యాత్ర కూడా ఉంది.దేశంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్‌ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్‌ విక్రమ్‌-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంపై వి. నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.

తమ తొలి ప్రయత్నంలోనే కక్ష్య ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు 28 ఏళ్ల సగటు వయసు గల ‘స్కైరూట్ ఏరోస్పేస్’ యువ బృందాన్ని అభినందించారు.  ఈ అద్భుత విజయం దేశీయ అంతరిక్ష సమాజానికి అపారమైన సంతృప్తిని ఇస్తుందని అన్నారు. అలాగే ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికతకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా, ‘స్కైరూట్ ఏరోస్పేస్’ వ్యవస్థాపకులైన పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఇద్దరూ గతంలో ఇస్రో శాస్త్రవేత్తలుగా పనిచేశారు. 2018లో ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి సొంతంగా స్కైరూట్ ఏరోస్పేస్‌ను ప్రారంభించారు.  2020లో అంతరిక్ష రంగ సంస్కరణను తీసుకువచ్చి స్టార్టప్ కంపెనీలు, ప్రైవేట్ రంగానికి అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతినిచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఈ రోజు (శనివారం) దేశంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఈ మైలురాయి గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించడంతో పాటు యువతలో బలమైన శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.  దేశంలో అంతరిక్ష రంగ సంస్కణలు రాకముందు కేవలం ఒక్క స్టార్టప్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 400కు చేరిందని చెప్పారు.

అధిక సంఖ్యలో ప్రైవేట్, వాణిజ్య ప్రయోగాలను చేపట్టడానికి భారతదేశ మౌలిక సదుపాయాల సామర్థ్యం గురించి అడిగిన ప్రశ్నకు నారాయణన్ రానున్న ఆరు నెలల్లో తమిళనాడులోని కులశేఖరపట్టిణంలో ఇస్రో తన రెండో ప్రయోగ సముదాయాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీహరికోటకు సమగ్ర సామర్థ్యాలు ఉన్నప్పటికీ, 300-350 కిలోల వర్గంలోని చిన్న ఉపగ్రహాల కోసం భారీ ప్రయోగ వేదికలను ఏర్పాటు చేయడం లాజిస్టిక్‌గా అంత శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.