భారత్‌లో 10 శాతం పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు

భారత్‌లో 10 శాతం పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు
ప్రస్తుత 2026 రెండో త్రైమాసికం (క్యూ2: ఏప్రిల్-జూన్)  కాలానికి గాను దేశంలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 శాతం క్షీణించాయి. గత ఆరేళ్ల కాలంలో జూన్ త్రైమాసికంలో ఈ స్థాయి పతనం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్‌లో విడిభాగాల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
 
ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ  కౌంటర్‌పాయింట్ తన తాజా నివేదికలో ఈ క్షీణతకు గల కారణాలను విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతకు డిమాండ్ పెరగడంతో, స్మార్ట్‌ఫోన్లలో వాడే మెమరీ చిప్‌ల ధరలు 2025 సెప్టెంబర్ నుండి దాదాపు నాలుగింతలు పెరిగాయి. విడిభాగాల ధరల ప్రభావంతో మొబైల్ కంపెనీలన్నీ ధరలను పెంచేశాయి. 
దీనివల్ల ముఖ్యంగా సామాన్యులు కొనే రూ. 15,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్ అమ్మకాలు ఏకంగా 45 శాతం పడిపోయాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత మార్కెట్ లీడర్‌బోర్డ్‌లో వివో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 18 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది.  అయితే ధరల పెరుగుదల వల్ల దీనికి చెందిన బడ్జెట్ సిరీస్ (వై,టి సిరీస్) అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టాప్-5 మొబైల్ బ్రాండ్లలో ఏకైక పాజిటివ్ వృద్ధిని నమోదు చేసిన సంస్థగా శాంసంగ్ నిలిచింది.
గెలాక్సీ ఏ, ఎస్ సిరీస్ ఫోన్లకు ఉన్న క్రేజ్, ప్రత్యేక ఆఫర్ల వల్ల శాంసంగ్ 2 శాతం వృద్ధి సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఒప్పో 14 శాతం వాటాతో మూడో స్థానంలో, షావోమీ 13 శాతంతో నాలుగో స్థానంలో, రియల్‌మీ  ఐదో స్థానంలో నిలిచాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తిరోగమనంలో ఉన్నా, లండన్‌కు చెందిన ప్రీమియం బ్రాండ్ ‘నథింగ్’ మాత్రం భారత్‌లో రికార్డు స్థాయి వృద్ధిని అందుకుంది.
గతేడాదితో పోలిస్తే ఈ బ్రాండ్ ఏకంగా 105 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.మార్కెట్లోకి కొత్తగా వచ్చిన నథింగ్ ఫోన్ (4a) సిరీస్‌తో పాటు, తాజాగా విడుదలైన నథింగ్ ఫోన్ (4బి)  ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30,000 పైబడిన ప్రీమియం సెగ్మెంట్‌లో మొదటి వారంలోనే అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా రికార్డు సృష్టించింది. 

నథింగ్ బ్రాండ్ సహ-వ్యవస్థాపకుడు అకిస్ ఇవాంజెలిడిస్ మాట్లాడుతూ తమ వైవిధ్యమైన డిజైన్, ఆవిష్కరణలతో పాటు ఐపీఎల్ 2026లో ఆర్సిబి జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించడం బ్రాండ్ రీచ్‌ను ఊహించని స్థాయికి తీసుకెళ్లిందని తెలిపారు.  ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ ఏడాది (2026) మొత్తం మీద భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఓవరాల్‌గా 13 శాతం మేర క్షీణించే ప్రమాదం ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అంచనా వేశారు.