లేబ‌ర్ పార్టీ నేత‌గా ఆండీ బ‌ర్న్‌హ‌మ్‌..సోమవారమే ప్రధానిగా!

లేబ‌ర్ పార్టీ నేత‌గా ఆండీ బ‌ర్న్‌హ‌మ్‌..సోమవారమే ప్రధానిగా!

బ్రిట‌న్‌లో అధికార లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా ఆండీ బర్న్‌హామ్ శుక్రవారం రోజు అధికారికంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన వచ్చే సోమవారం రోజు యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా సమర్పించిన వెంటనే కింగ్ ఛార్లెస్- III ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. దీంతో 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బర్న్‌హామ్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టనున్నారు.

త‌న నాయ‌క‌త్వంలో పార్టీని న‌డిపించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మాజీ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్ ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లు పార్టీని నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు. పార్టీ నేత‌గా స్టార్మ‌ర్ ఉన్న స‌మ‌యంలో ఓట‌మి ద‌శ నుంచి పార్టీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింద‌ని, లేబ‌ర్ పార్టీ ఇప్పుడు ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చేస్తోంద‌ని చెప్పారు. 
 
లండన్‌లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్ఈసీ) ఛైర్ షబానా మహ్ముద్ బర్న్‌హామ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ‘ఈ ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే. అందుకే ఫలితం ముందుగానే ఖరారైంది’ అని తెలిపారు. ఆండీ బర్న్‌హామ్ ఒక్కరే అభ్యర్థిగా నిలిచారు. ఎలాంటి ఉత్కంఠకు తావులేదు, బరిలో నిలిచింది ఒక్కరేనని సరదాగా వ్యాఖ్యానించారు షబానా. 
 
గురువారం రాత్రి నాటికి బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ ‘హౌస్ ఆఫ్ కామన్స్‌’లోని లేబర్ పార్టీకి చెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. భారీ మెజార్టీ మద్దతు సాధించడంతో ఆయన విజయం ముందుగానే ఖరారైపోయింది. ఆండీ బర్న్‌హామ్- లివర్‌పుల్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1970లో జన్మించారు. 
 
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పట్టా పొందారు. అక్కడే నెదర్లాండ్స్‌కు చెందిన విద్యార్థిని మేరీ ఫ్రాన్స్ వాన్ హీల్‌ను కలుసుకున్నారు. 2000లో వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజకీయాల్లోకి రాకమునుపు బర్న్‌హామ్ జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 
 
2001లో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన ఆయన, మాజీ ప్రధాని గోర్డన్ బ్రౌన్ ప్రభుత్వంలో ట్రెజరీ చీఫ్ సెక్రటరీ, సాంస్కృతిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో ఎంపీ పదవికి రాజీనామా చేసి గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రజా రవాణా, గృహ నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.