విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్రలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా, మరో 130 మందికిపైగా గాయపడ్డారు. మరీచకోట్‌కు చేరువలో ఈ దుర్ఘటన సంభవించింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో అదుపుతప్పి తొక్కిసలాటకు దారితీసినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రులకు తరలించారు.
బోడా దండాపై రథం లాగుతుండగా ఈ ఘటన జరిగింది. ఊపిరాడకపోవడంతో ఒక భక్తుడు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. అతడిని వెంటనే పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి చేరుకునేసరికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన వారికి అత్యవసర వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. ఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల దివ్య యాత్రను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా గుర్తించినట్టు తెలిపారు. ఘటనకు గల కచ్చితమైన కారణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రథయాత్ర సందర్భంగా భక్తులు పోటెత్తడంతో సింహద్వారం వద్ద అస్వస్థతకు గురైన పలువురు భక్తులను నిర్వాహకులు స్ట్రెచర్ల ద్వారా తరలించి రక్షించారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన 50 మందికి వివిధ దవాఖానలలో చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భక్తులు రథాలవైపు దూసుకురావడంతోనే ఒకరినొకరు నెట్టుకుని, కిందపడిపోయి ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వాతావరణ శాఖ ప్రకారం మంగళవారం నుంచి పూరీలో 233 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, రథయాత్రకు సన్నద్ధతపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమీక్షా సమావేశం నిర్వహించి, భక్తుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.
వర్షం కారంగా నీరు నిలిచిపోవడం ఒక ప్రధాన సవాలుగా మారడంతో, పూరీ జిల్లా యంత్రాంగం, పురపాలక అధికారులు, సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రథయాత్ర కోసం పూరీలో 19 మంది ఐపీఎస్ అధికారులు, దాదాపు 13,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించి, బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.

More Stories
9వ తరగతిలో మూడో భాషతో విద్యార్ధులపై అనవసరపు ఒత్తిడి
హర్మూజ్ నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదు
పార్లమెంట్లో ‘స్మార్ట్’ పరికరాలు వాడొద్దు