నూతన జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా త్రిభాషా సూత్రం అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కరిక్యులమ్ లో భాగంగా 9వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టడం వల్ల బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడిని పెరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్‌వీ) ఏర్పాటుకు వీలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన దిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ పాఠశాలల్లో తిభాషా సూత్రం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
అయితే, ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు జేఎన్‌వీల ఏర్పాటుకు నిరాకరిస్తోంది.ఈ కేసులో త్రిభాషా విధానం చెల్లుబాటును ప్రత్యక్షంగా పరిగణనలోకి తీసుకోనప్పటికీ, మూడో భాషను ప్రవేశపెట్టే సమయంపై జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా విధానంపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి.
అయితే, ఈ విధానం హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయదని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. “స్థానిక భాషను బోధించాలి, ఆంగ్లాన్ని బోధించాలి, ఏదైనా మూడో భాషను బోధించాలి. అందులో హిందీ అని చెప్పలేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతివాది తరఫున హాజరైన లాయర్ జి. ప్రియదర్శిని ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దకూడదని జాతీయ విద్యా విధానం స్పష్టంగా చెబుతోందని ఎత్తి చూపారు. దీనికి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ ‘మీకు హిందీ వద్దు, కానీ సంస్కృతం అయితే సమస్య ఏమిటి?’ అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘‘దయచేసి 9వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టవద్దు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డులలో 10వ తరగతి ఒక బోర్డు పరీక్ష. 8వ తరగతి చివరి నుంచే ఒత్తిడి మొదలవుతుంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 1970వ దశకంలో తన విద్యానుభవాన్ని గుర్తుచేసుకుంటూ, బోర్డు పరీక్షలకు సిద్ధం చేయడానికి విద్యార్థులకు 8వ తరగతిలోనే 10వ తరగతి భావనలను పరిచయం చేసేవారని ఆమె చెప్పారు.
‘‘అలాంటి సన్నద్ధత మాకే ఉన్నప్పుడు, మరి నేటి విద్యార్థుల సంగతేంటి? 9వ తరగతిలో కొత్త భాషను ప్రారంభించొద్దు. 6వ తరగతిలోనే ప్రారంభించండి. నేను నా అనుభవాన్ని గుర్తుచేసుకుంటున్నాను’’ అని సూచించారు. ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వానికి సైతం కేవలం కేంద్రం నుంచి వచ్చాయన్న కారణంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరస్కరించవద్దని సలహా ఇచ్చారు.

More Stories
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి .. ఒకరు మృతి
హర్మూజ్ నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదు
పార్లమెంట్లో ‘స్మార్ట్’ పరికరాలు వాడొద్దు