అమెరికా- ఇరాన్ యుద్ధం తీవ్రమైన వేళ హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. హర్మూజ్ గుండా రాకపోకలు సాగించే నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదని సముద్రయాన నియంత్రణ సంస్థ(డీజీఎంఏ) స్పష్టంచేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఈ ఆదేశాలను అమలు చేయాలని నౌకల యజమానులు, నిర్వాహకులు, రిక్రూట్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్స్ సంస్థలకు నిర్దేశించింది.
గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు దిగజారుతున్న వేళ భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీఎంఏ వివరించింది. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధితో పాటు పరిసర ప్రాంత జలాల్లో నిఘాను పెంచాలనీ నావిగేషనల్ హెచ్చరికలు, భద్రతాసలహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఐఎస్పీఎస్ కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించింది.
నౌకాయానానికి సంబంధించిన అంతర్జాతీయ నియామవళిని కచ్చితంగా పాటించాలని పేర్కొంది. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన వివరాలను షేర్ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, భారత నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
కాగా అమెరికా- ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఘర్షణలతో కూడిన హర్మూజ్ జలసంధిలో అనేక వాణిజ్య నౌకలు దాడులకు గురవుతున్నాయి. తాజాగా యూఏఈ నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ఇద్దరు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ రెండు నౌకలు నేవిగేషన్ హెచ్చరికలను విస్మరించినట్లు సమాచారం.
అలాగే, ఇటీవల ఒమన్ తీరంలో జీఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఆ దాడిలో ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. తాజాగా అతడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన అనంతరం అతడిని కాపాడేందుకు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
కొద్దిరోజుల క్రితం కూడా ఒమన్ తీరంలో వైద్యం అందక భారత నావికుడు మృతి చెందాడు. ఒమన్ తీరంలోని ‘ఎంటీ సెలెస్టియల్’ నౌకలో సెకండ్ ఆఫీసర్ నిశాంత్ అనారోగ్యానికి గురయ్యాడు. అయితే, ఇరాన్ దాడులు చేస్తుండటంతో సకాలంలో అతడికి వైద్య సాయం అందలేదు. ఈ నేపథ్యంలో నిశాంత్ మరణించినట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

More Stories
అస్సాం వరదల్లో 87కు పెరిగిన మృతుల సంఖ్య.. 11 రైళ్లు రద్దు
నియామక పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్లో జెన్ జీ నిరసనలు
సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు