మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పర్యావరణ పునరుజ్జీవనమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అని ప్రశ్నిస్తూ దానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులను తిరస్కరించాలని సిఫార్సు చేయాల్సిందిగా రాష్ట్ర స్థాయి నిపుణుల మదింపు కమిటీ (ఎస్ఈఎసి)కి మూసీ జన ఆందోళన్ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 36.07% రోడ్లు, వంతెనల నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారని పేర్కొంటూ ఇదంతా కాంక్రీటీకరణే అని స్పష్టం చేశారు.
మూసీ రివర్‌ఫ్రంట్ పర్యావరణ అంచనా నివేదికలో ఉన్న లోపాలను, సామాజిక, పర్యావరణ ప్రభావాల పట్ల ఉన్న తీవ్ర నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా ఎస్ఈఎసి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ ప్రాజెక్టు ఫేజ్ 1ఏ, ఫేజ్ 1బిలకు పర్యావరణ అనుమతులను తిరస్కరించాలని కోరుతూ ఎస్ఈఎసి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (ఎస్ఈఐఎఎ) లకు లేఖలు రాశారు.
ఈ ప్రాజెక్ట్ భారీ రహదారులు, మౌలిక సదుపాయాలు, సుందరీకరణతో కూడిన వాణిజ్య, రియల్ ఎస్టేట్ ఆధారిత అభివృద్ధి నమూనాకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంటూ ఇది పూడ్చలేని భారీ సామాజిక, పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుందని మూసీ జన ఆందోళన్ హెచ్చరించింది. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాథమిక స్వభావం, తీరు తాజాగా విధివిధానాలు మంజూరు దశ నుండి పర్యావరణ అనుమతి కోరే దశకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయిందని విస్మయం వ్యక్తం చేశారు.
ప్రాధమిక దశలో 17.85 హెక్టార్లుగా ఉన్న రహదారి విస్తీర్ణం ఈఐఎ నివేదికలో 64.37 హెక్టార్లకు పెరిగిందని, రోడ్ల నిర్మాణం మూడు రెట్లు పెరిగి ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణంలో దాదాపు మూడింట ఒక వంతుగా ఉందని పేర్కొంది. అదే సమయంలో, పచ్చదనం (గ్రీన్ ఏరియా) విస్తీర్ణం 109.41 హెక్టార్ల నుండి 55.65 హెక్టార్లకు అంటే దాదాపు సగానికి పడిపోయిందని గుర్తించింది.
ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ అనగా రూ. 1836.42 కోట్లు కేవలం రోడ్లు, వంతెనల నిర్మాణానికే కేటాయించారని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి విభాగానికి సంబంధించిన వ్యయ వివరాలు విడిగా ఇవ్వకపోవడం వల్ల, టో వాల్స్, రివెట్‌మెంట్, రిటైనింగ్ వాల్స్ వంటి హార్డ్ ఇంజనీరింగ్ నిర్మాణాల పరిధిని, తీవ్రతను దాచిపెడుతున్నారని విమర్శించారు. వీటన్నింటికీ కలిపి రూ. 1887.39 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని పేర్కొన్నారు.
ప్రజల నిర్వాసితం కు సంబంధించిన లెక్కల్లో ఉన్న భారీ వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ తాజాగా విధివిధానాలు మంజూరు కోసం సమర్పించిన కామన్ అప్లికేషన్ ఫామ్‌లో 12,204 కుటుంబాలు నిర్వాసితులవుతాయని, 15,255 కుటుంబాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నట్లు తెలిపింది. 1,400 శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను గుర్తించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే, ఈ మార్పుకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే, ఈఐఎ నివేదికలో ఈ సంఖ్యను సుమారు 639 శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలకు తగ్గించారని ఆరోపించారు.నివేదికలో ఉన్న తీవ్రమైన శాస్త్రీయ లోపాలను, విధివిధానాల నిబంధనల ఉల్లంఘనలను వెల్లడిస్తూ నిబంధనల ప్రకారం 25 ప్రాంతాల్లో భూగర్భ జలాల పర్యవేక్షణ చేయాల్సి ఉండగా, కేవలం 5 ప్రాంతాల్లో మాత్రమే ఈ పర్యవేక్షణ చేసిందని, ఇది స్పష్టంగా విధివిధానాలను నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. మూసీ నది ఫార్మాస్యూటికల్ కాలుష్యానికి గురవుతోందని అందరికీ తెలిసినప్పటికీ, మట్టి నాణ్యత అంచనాలో ఫార్మాస్యూటికల్ అవశేషాలు, యాంటీబయాటిక్స్, యాంటీమైక్రోబయాల్-రెసిస్టెన్స్ మార్కర్లతో సహా ఫార్మాస్యూటికల్ కంపెనీల నుండి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలను పరీక్షించలేదని విస్మయం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ప్రతిపాదిత అభివృద్ధిలో సుమారు 44.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు ఉన్నాయని, ఇది సుమారు 1700 ఒలింపిక్-సైజు స్విమ్మింగ్ పూల్స్‌ను పూర్తిగా నింపడానికి లేదా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సును సగటున 3 నుండి 4 అడుగుల లోతు వరకు నింపడానికి సమానమని తెలిపారు. ఈఐఏ నివేదికలో డ్యామ్ సేఫ్టీ చట్టం, 2021ను విస్మరించారని, ఇది ఒక ప్రధానమైన లోపమని గుర్తించారు.
అలాగే, పట్టణ ప్రాంతాల్లో నిర్మిత ప్రదేశాలు వేడిని గ్రహించి అర్బన్ హీట్ స్ట్రెస్‌ను పెంచుతాయని పేర్కొన్నప్పటికీ, ప్రాజెక్టు వల్ల పెరిగే వేడి తీవ్రత పరిస్థితులను నివేదిక పూర్తిగా విస్మరించిందని తెలిపారు. భూసేకరణ, పునరావాసం, బదిలీలో న్యాయమైన పరిహారం- పారదర్శకత చట్టం, 2013 లోని సవరించిన సెక్షన్ 10ఏ కింద మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (సామాజిక ప్రభావ అంచనా) నుండి మినహాయింపు లభించిందని మూసీ జన ఆందోళన్ పునరుద్ఘాటించింది. ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే సామాజిక ప్రభావంపై, ముఖ్యంగా వేలాది కుటుంబాల నిర్వాసితం గురించి ఎలాంటి అధికారిక అంచనా లేదని పేర్కొంది.
నిర్వాసిత, పునరావాసం వల్ల కలిగే ప్రభావాలు కేవలం ఒక కుటుంబాన్ని ఒక ఇల్లు నుండి మరొక ఇంటికి మార్చడంతో ముగిసిపోవని, ఇక్కడ స్థిరపడిన కుటుంబాల ఉపాధి కూడా దెబ్బతింటుందని, ఉద్యోగాలు కోల్పోతారని, అన్ని విధాలుగా ఆర్థిక భారం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి సామాజిక ప్రభావ అంచనా నిర్వహించకుండా, కేవలం సామాజిక-ఆర్థిక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పడం పూర్తిగా అర్థరహితమని స్పష్టం చేశారు. పదివేల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులవుతున్న ఈ రూ. 7,000 కోట్ల ప్రాజెక్టులో, కేవలం 400 దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది చాలా తక్కువని విమర్శించింది.
మురుగునీరు, వర్షపు నీటి నెట్‌వర్క్‌లకు శాశ్వత పరిష్కారం ద్వారా మూసీ నదిని శుభ్రపరచడం, పునరుద్ధరించడం సాధ్యమేనని, సహజ నదీ పర్యావరణాన్ని నాశనం చేయకుండా లేదా దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న శ్రామిక వర్గాల నివాసాలను, జీవనోపాధిని దెబ్బతీయకుండా దీనిని సాధించవచ్చని, సాధించాలని ఈ సందర్భంగా మూసీ జన ఆందోళన్ పునరుద్ఘాటించింది. కాంక్రీట్ కట్టల కోసం, రోడ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ప్రజలను నిర్వాసితులను చేయడం పర్యావరణపరంగా వినాశకరమైనదని, సామాజికంగా అన్యాయమైనదని, దీనిని పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేసింది.

More Stories
`పారిశ్రామిక కుటుంభం’ పరస్పర విశ్వాసం, చర్చల ద్వారానే సాధ్యం
ఇరాన్ సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న అమెరికా
రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతా రానున్న తస్లీమా నస్రీన్