ధర్నాచౌక్‌ వద్ద వేలాదిమంది నిరుద్యోగుల రణభేరి

ధర్నాచౌక్‌ వద్ద వేలాదిమంది నిరుద్యోగుల రణభేరి
పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు రణభేరి మోగించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిరుద్యోగ రణభేరి’కి జిల్లాల నుంచి వేలాదిగా నిరుద్యోగులు తరలివచ్చారు. 20 వేల పోస్టులతో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే రెండు రోజుల తరువాత దిల్‌సుఖ్‌నగర్‌లో సత్యాగ్రహ దీక్ష చేపడుతామని హెచ్చరించారు.
 
‘20 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే కేవలం ఏడు వేల పోస్టులను నిరుద్యోగులకు భిక్షంగా వేస్తరా? 20 వేల పోలీసు ఉద్యోగాలతో నోటిఫికేషన్‌ ఇస్తే దిల్‌సుక్‌నగర్‌లో పాలాభిషేకం చేస్తం. లేదంటే నీ రాజకీయ జీవితానికి పాడె కట్టి ఊరేగిస్తం’ అని నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌  ఆగ్రహం వ్యక్తంచేశారు. 
ప్రభుత్వం మొండిగా వ్యవహరించి, నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే నిరుద్యోగులు తమ ఓట్లతో గెలిపించిన కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ సమాధి కడుతారని హెచ్చరించారు.  ఓయూ జేఏసీ నేత వినోద్‌ నాయక్‌ మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలకు త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే రాబోయే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఓడించి తిరుతామని హెచ్చరించారు. లక్షలాది మంది నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్‌ వేయకపోతే తెలంగాణతోపాటు ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్‌లో ‘కాంగ్రెస్‌ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. 

పోలీసు ఉద్యోగాలతోపాటు జీపీవో, మెగా డీఎస్సీ, గ్రూప్స్‌ పోస్టులు విడుదల చెయ్యాలని, లేకపోతే నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌ సర్కార్‌ను అదే ఓట్లతో బొందపెడ్తామని హెచ్చరించారు.  నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీని అశోక్‌నగర్‌, చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు అదే రాహుల్‌గాంధీని తీసుకొచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు.  

తాము అధికారంలోకి వస్తే జీవో-46ను రద్దు చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. జీవో-46ను రద్దు చేయకుండా నోటిఫికేషన్‌ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎస్‌ఐ ఉద్యోగాలకు వయోపరిమితిని 38 ఏండ్లకు, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు వయోపరిమితిని 36 ఏండ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ను ఏ దొంగలు ఎత్తుకుపోయారో ముఖ్యమంత్రి చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. వచ్చే ఆగస్టుకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి రెండేండ్లు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.