ఇరాన్‌పై అమెరికా భీకరంగా విరుచుకుపడుతోంది. అత్యంత కీలకమైన ట్యూన్బ్ దీవులపై గురిపెట్టింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య, నౌకాదళ నౌకలను బెదిరించడానికి ఇస్లామిక్ రిపబ్లిక్ (ఇరాన్) తన సైనిక సామర్థ్యాలను ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ అమెరికా దళాలు ఇరాన్‌పై తాజాగా వైమానిక దాడులను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌ను “మర్యాదగా ప్రవర్తించాలని” హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ తాజా దాడులు జరిగాయి.
“ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు (ఈస్టర్న్ టైమ్), అమెరికా దళాలు ఇరాన్‌పై రెండవ విడత దాడులను ప్రారంభించాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన అంతర్జాతీయ జలమార్గమైన హోర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే నౌకలను బెదిరించడానికి ఇరాన్ ఉపయోగిస్తున్న సైనిక సామర్థ్యాలను ఈ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయి. కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ఇరాన్‌ను జవాబుదారీగా నిలబెడుతోంది,” అని సెంట్రల్ కమాండ్ తన పోస్ట్‌లో పేర్కొంది.
ఓడరేవుల దిగ్బంధనంపై మండిపడ్డ ఐఆర్జీసీ, పశ్చిమాసియాలో హర్మూజ్‌తో పాటు మరిన్ని రవాణా మార్గాలను మూసివేస్తామని ప్రకటించింది. హర్మూజ్ ద్వారా చుక్క చమురు, గ్యాస్ వెళ్లనివ్వబోమని హెచ్చరించింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం నుంచి వైదొలిగినట్లు ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా ప్రతిదాడులు చేస్తున్నది. దాంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇన్నాళ్లు రాత్రిపూట దాడులకే పరిమితమైన అగ్రరాజ్యం చాలా రోజుల తర్వాత తొలిసారిగా బుధవారం పగటిపూట దాడులకు తెగబడింది. వచ్చే వారం పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. సెంట్రల్ కమాండ్ప్రకారం, అమెరికా దళాలు గ్రేటర్ తున్బ్ ద్వీపంలోని ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ, ప్రయోగ స్థావరాలపై ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులను ఉపయోగించి 90 నిమిషాల పాటు ఆపరేషన్ నిర్వహించాయి.
ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకటైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని ఈ మునుపటి దాడులు మరింతగా దెబ్బతీశాయని సైనిక కమాండ్ తెలిపింది. హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు నిర్వహించనున్నట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) వెల్లడించింది.
ముఖ్యంగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేలా, అణు కార్యక్రమంపై అమెరికా విధించే షరతులకు ఒప్పుకునేలా ఇరాన్‌పై దాడులను విస్తృతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. తమపై దాడులకు నిరసనగా పశ్చిమాసియా నుంచి అన్ని ఇంధన ఎగుమతులను నిలిపివేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బుధవారం హెచ్చరించింది.
‘ఈ ప్రాంతం నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులు అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండకూడదు’ అని పేర్కొంది.
కాగా, ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మన్పూర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇరాన్ అంతటా ఇటీవల జరిగిన అమెరికా వైమానిక దాడుల్లో 35 మందికి పైగా మరణించగా, కనీసం మరో 72 మంది ఆసుపత్రి పాలయ్యారు. అమెరికా జరిపిన దాడుల్లో ఏడుగురు సైనికులు మరణించినట్టు ఇరాన్ ఆర్మీ వేరొక ప్రకటనలో తెలిపింది. ఆగ్నేయ సిస్తాన్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని బంపూర్ కౌంటీలో ఉన్న భూతల దళాల స్థావరాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు గాయపడ్డారని వివరించింది.
తమ గార్డు పోస్టులు, మిలిటరీ కేంద్రాలు, గెస్ట్‌హౌస్‌లపై 13 క్షిపణులు దాడి చేశాయని వెల్లడించారు. కాగా, బహ్రెయిన్, జోర్డాన్లలో బుధవారం ఉదయమే ఇరాన్ దాడుల గురించి హెచ్చరికగా సైరన్లు మోగాయి. తాము మూడు ఇరాన్ క్షిపణులను నేలకూల్చినట్టు జోర్డాన్ ప్రకటించింది. నౌకాదళ దిగ్బంధనం విధించి అమెరికా ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇక ఒప్పందం అవసరం తమకులేదని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టంచేసింది.
హర్మూజ్ జలసంధిపై సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది తేల్చి చెప్పారు. ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు.

More Stories
రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతా రానున్న తస్లీమా నస్రీన్
అమల్లోకి భారత్- బ్రిటన్ సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం
పాక్ ఆగడాలకు నిరసనగా పీవోకేలో లాంగ్‌మార్చ్