ఓబీసీలకు కాంగ్రెస్ అడుగడుగునా ద్రోహం చేసింది

ఓబీసీలకు కాంగ్రెస్ అడుగడుగునా ద్రోహం చేసింది

నెహ్రూ కాలం నుండి నేటి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (బీసీ) సామాజిక వర్గాలకు అడుగడుగునా ద్రోహం చేశాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత  సూరవరం శ్రీనివాస్ రచించిన “కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఓబీసీలకు చేసిందేమిటి?” పుస్తకావిష్కరణ సభలో ఆయన  పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి వెనుకబడిన వర్గాల పట్ల తీవ్రమైన వివక్ష, వ్యతిరేక మైండ్‌సెట్ ఉందని ధ్వజమెత్తారు. 

ధర్మ జాగరణ అఖిల భారత సహా ప్రముఖ్ ఆలే శ్యామ్  కుమార్ ముఖ్యఅతిధిగా పాల్గొని ఈ గ్రంధాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎంపీ డా. బి నర్సయ్య గౌడ్ అధ్యక్షత వహించగా, ఎంపీ ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.  దేశ ప్రధానిగా ఉన్న సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ 7 జూన్ 1961 న దేశ ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖ రాస్తూ తాను రిజర్వేషన్లకు వ్యతిరేకమని, మెరిట్ దెబ్బతింటుందని, కాబట్టి రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించవద్దని స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.

నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుందే తప్ప వారి సామాజిక అభ్యున్నతికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. బ్రిటిష్ కాలంలో 1881 నుండి 1931 వరకు ప్రతి పదేళ్లకోసారి కులగణన జరిగేదని, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల జనాభా లెక్కల వివరాలను ఎందుకు తొక్కిపెట్టిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీల హక్కుల కోసం మండల్ కమిషన్ నివేదిక వచ్చినప్పుడు, నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు పార్లమెంటులో ఏకంగా రెండు గంటల పాటు ప్రసంగిస్తూ ఆ నివేదికను, ఓబీసీ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్ నాడు తీవ్రంగా అడ్డుకుందని తెలిపారు. అయితే, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి వివాదాలు లేకుండా, ఉన్న రిజర్వేషన్లలో కూడా ఎవ్వరికి అన్యాయం జరగకుండా అగ్రవర్ణాలలోని పేదల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు తీసుకువచ్చి అందరికీ న్యాయం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీల పొట్ట కొట్టిందని ఆరోపించారు. 

కేవలం ఓట్ల కోసం గతంలో ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కోటాలోనే ముస్లింలకు 5 శాతం సబ్‌కేటగిరీ రిజర్వేషన్లు కల్పించి వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లలోని సబ్ కేటగిరీలో ముస్లింలను చేర్చడం ద్వారా అర్హులైన హిందూ బీసీ సామాజిక వర్గాల యువత తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.