సింగరేణి నుంచే తెలంగాణలో బీజేపీ అధికారానికి పునాది 

సింగరేణి నుంచే తెలంగాణలో బీజేపీ అధికారానికి పునాది 

సింగరేణి కార్మికుల పోరాటం కేవలం ఒక సంస్థకే పరిమితం కాదని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇదే నాంది కావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ‘సింగరేణి భరోసా యాత్ర’లో భాగంగా మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ సింగరేణి నుంచే తెలంగాణ అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు విధాన పరంగా ఎలాంటి తేడా లేదని ఆయన విమర్శించారు. అవినీతి చేయడంలో, ప్రజలను వంచించడంలో, ఇచ్చిన ఎన్నికల హామీలను గాలికి వదిలేయడంలో రెండు పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కంటే అవినీతిపైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఆరోపించారు. 

కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారే తప్ప, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. విద్యార్థులు, రైతులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు (రైతు భరోసా) వంటి పథకాల అమలు సరిగ్గా అమలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ నిధులను నేరుగా, సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని గుర్తు చేశారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ. 13 లక్షల కోట్ల భారీ నిధులను కేటాయించిందని రాంచందర్ రావు వెల్లడించారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, జాతీయ రహదారులు, రైల్వే మౌలిక వసతులు, పారిశ్రామిక పార్కులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం యుద్ధప్రాతిపదికన అమలు చేసిందని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని వివరించారు.

తాడిచెర్ల–2 కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం ద్వారా సంస్థను మరింత బలోపేతం చేసి, నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గతంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ సింగరేణి సంస్థకు ఇటువంటి కోల్ బ్లాక్‌ల కేటాయింపులు ఎందుకు తీసుకురాలేకపోయిందని ఆయన నిలదీశారు.

గతంలో బీఆర్ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చి మోసపోయిన తెలంగాణ ప్రజలు, రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్క అవకాశం బిజెపికి ఇవ్వాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని రాంచందర్ రావు చెప్పారు.