హర్మూజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనకు సంబంధించి భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జావెద్ హుస్సేనీని విదేశాంగ శాఖ పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీచేసింది.
ఒమన్‌కు సమీపంలోని హర్మూజ్ జలసంధి దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న ‘మొంబాసా’, ‘అల్ బహియాహ్’ చమురు ట్యాంకర్లపై ఇటీవల దాడి జరిగింది. ఈ దాడిలో ‘మొంబాసా’ నౌకలో పనిచేస్తున్న ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడగా, వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఎంటి అల్ బహియా నౌకలోని 12 మంది భారతీయ సిబ్బందిలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఎంటి మొంబాసా నౌకలో ఉన్న 18 మంది భారతీయులలో తొమ్మిది మంది గాయపడ్డారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరణించిన నావికుడి కుటుంబానికి మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రభావితమైన భారతీయ సిబ్బందికి సహాయం చేయడానికి, యూఏఈలోని భారత మిషన్, పోస్ట్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, యూఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయని అది పేర్కొంది.
దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రెండు నౌకలకు భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది తీవ్ర ముప్పు అని అభివర్ణించింది.
ఈ పరిణామంపై స్పందించే పూర్తి హక్కు యూఏఈకి ఉందని స్పష్టంచేసింది. దేశ భద్రత, ప్రజలు, జాతీయ ప్రయోజనాలు, కీలక ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

More Stories
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ముగ్గరు షూటర్లు అరెస్ట్
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్షిప్ ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం!
మైనర్ బాలికపై అత్యాచారం, హత్యలో అరెస్టులు 35కు పెరుగుదల