భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన నిరాధారం

భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన నిరాధారం

భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందనే వార్తలను  భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్, భారత్  వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు.  ‘మెరుగైన ఒప్పందం’ కోసం లక్ష్యంగా పెట్టుకుని, అమెరికాతో ‘త్వరిత వాణిజ్య ఒప్పందాన్ని’ భారతదేశం తిరస్కరించిందని పేర్కొన్న ఒక మీడియా నివేదికను ఖండిస్తూ గోర్ దానిని ‘నకిలీ వార్త’ అని పేర్కొంటూ, ఇరు పక్షాలు వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కట్టుబడి ఉన్నాయని, ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని పునరుద్ఘాటించారు. 

“నకిలీ వార్త హెచ్చరిక! ఎవరూ దేనినీ తిరస్కరించలేదు,” అని గోర్ ఎక్స్ లో తెలిపారు. “ఇరు పక్షాలు చాలా నిర్మాణాత్మక సమావేశాలు జరిపి, వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. మేము చురుకుగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. రాయిటర్స్ – మీరు ఇంతకంటే మెరుగ్గా చేయగలరు!” పీయూష్ గోయల్ కూడా ఈ మీడియా నివేదికను “పూర్తిగా అబద్ధం, నిరాధారం, తప్పుదోవ పట్టించేది” అని పేర్కొంటూ తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత గోర్ ఈ విధంగా స్పందించారు. 

వాణిజ్య ఒప్పందాన్ని సాధించడంలో భారత, అమెరికా బృందాలు పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు. “జూన్‌లో యూఎస్‌టీఆర్ జేమీసన్ గ్రీర్, @USTradeRep, ఢిల్లీని సందర్శించినప్పుడు నేను ఆయనతో అద్భుతమైన సమావేశాలు జరిపాను,” అని గోయల్ తెలిపారు. సమతుల్యంగా, వాణిజ్యపరంగా అర్థవంతంగా ఉండి, ఇరు దేశాలలోని వ్యాపారాలు, రైతులు, కార్మికులు మరియు వినియోగదారులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించే ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.

“జూన్ నెలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసర్ గ్రీర్ ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనతో అద్భుతమైన సమావేశాలు జరిపాను. ఇరుదేశాల్లోని వ్యాపారులు, రైతులు, కార్మికులు, వినియోగదారులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించే, వాణిజ్యపరంగా అర్థవంతమైన, సమతుల్యమైన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మా బృందాలు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాయి” అని గోయెల్ పేర్కొన్నారు. 

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఎలాంటి అడ్డంకులు లేవని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, అంతర్జాతీయ వ్యాపార రంగంలో భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేసేలా, ఎలాంటి తొందరపాటు లేకుండా పక్కా వ్యూహంతో ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.