ఆచార్య మాదిరాజు రంగారావు రచనలు మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తాయని జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కొనియాడారు. కవిత్వంలో జీవితానికి అన్వయించుకోవాల్సిన ఎన్నో విలువలు ఆ సాహిత్యంలో ఉన్నాయని తెలిపారు. మాదిరాజు రంగారావు రసధుని సాహితీ పరిషత్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య మాదిరాజు రంగారావు ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన రచించిన ‘స్వేచ్ఛా కవిత్వం’ (11 సంపుటాలు), ‘సాహిత్యం విమర్శ’ (2 సంపుటాలు), ‘సాహితీ వైజయంతి’ గ్రంథాలను శనివారం జస్టిస్ నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.
సాహిత్యం సామాజిక మార్పుకు సాధనంగా నిలవాలని, సమాజంలో జరుగుతున్న దారుణాలపై సాహితీవేత్తలు స్పందించి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షులు డా. వెల్చాల కొండల్ రావు ప్రారంభోపన్యాసంలో మాదిరాజు రంగారావు స్వేచ్ఛా కవిత్వమంతా మానవతా దృక్పథంతో నిండి ఉందని తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య ‘తెలంగాణ స్వరం’ కవితా సంపుటి ద్వారా ఆయన కవితా హృదయం, తెలంగాణ ఆత్మ ఆవిష్కృతమైందని పేర్కొన్నారు.
ప్రధానోపన్యాసకులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ, కాల్పనిక కవిత్వం తర్వాత అభ్యుదయ కవిత్వ ఉద్యమాల నడుమ స్వేచ్ఛా కవిత్వానికి ప్రత్యేక దిశను చూపిన కవి మాదిరాజు రంగారావు అని తెలిపారు. సాంస్కృతిక చైతన్యం, జాతీయ దర్శనం, ప్రకృతి, సామాన్య జీవితం వంటి అంశాలను ఆయన కవిత్వంలో సజీవంగా ప్రతిబింబించారని చెప్పారు.
జస్టిస్ మంగరి రాజేందర్ మాట్లాడుతూ, మాదిరాజు రంగారావు నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన మహోన్నత సాహితీవేత్త అని, గొప్ప రచనలు చేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు విజయ్ బాబు మాట్లాడుతూ, 170కి పైగా గ్రంథాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహోన్నత పండితుడు మాదిరాజు రంగారావు అని కొనియాడారు. ప్రాచీనత, ఆధునికతల సమన్వయం ఆయన రచనల్లో ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు.
తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి కన్వీనర్‌గా సభను నిర్వహించారు. ఆచార్య మాదిరాజు రంగారావు సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఆయన కుమారుడు సంతోష్, కుమార్తెలు హరిత, చరిత కలిసి ఆచార్య మాదిరాజు రంగారావు రసధుని సాహితీ పరిషత్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన కవులు, సాహితీవేత్తలను గౌరవించడంతో పాటు స్వేచ్ఛా కవిత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన సాహిత్య సంపదను గ్రంథరూపంలో అందుబాటులోకి తీసుకురావడంలో వారితో పాటు, డా. వెల్చాల కొండల్ రావు విశేష కృషి చేశారని కొనియాడారు.
More Stories
ఫిన్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి
తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రెయిన్స్
భార్య, ఇద్దరు పిల్లలతో సహా పోక్సో నిందితుడు ఆరుగురి దారుణ హత్య