హైదరాబాద్ నగరానికి చెందిన బీ టెక్ విద్యార్థి గుజ్జా మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లో అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. గత మే నెల 5వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన మణిదీప్ మృతదేహం జూలై 9వ తేదీన సముద్రంలో లభ్యమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లోని ఎల్‌యూటీ యూనివర్సిటీలో ఉన్నత చదువును అభ్యసిస్తున్నాడు.
మణిదీప్ కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీసులు, కోస్ట్ గార్డ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో క్రూనువోరెన్‌రాంటా వాటర్ ఫ్రంట్ ప్రాంతంలో అతని మృతదేహాన్ని గుర్తించారు. మణిదీప్ మృతికి గల కారణాలపై ఫిన్లాండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి నేరపూరిత కోణం కనిపించడం లేదని అధికారులు ప్రాథమికంగా స్పష్టం చేశారు.
మణిదీప్ చివరిసారిగా మే 5న తన తల్లితో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మణిదీప్ ఆచూకీ కోసం అతని స్నేహితులు, యూనివర్సిటీ అధికారులను కుటుంబ సభ్యులు పలుమార్లు సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.
దాదాపు 45 రోజుల పాటు కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గుజ్జా హరినాథ్, ముత్యం రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అత్యవసర జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, రెండు నెలలకు పైగా కొనసాగిన ఆందోళనకు చివరికి విషాదకర ముగింపు పలికింది. మణిదీప్ మృతదేహం సముద్రంలో లభించడంతో కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు

More Stories
తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రెయిన్స్
భార్య, ఇద్దరు పిల్లలతో సహా పోక్సో నిందితుడు ఆరుగురి దారుణ హత్య
ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే తుది ఓటరు జాబితాలో పేరు!