భారత్, ఆస్ట్రేలియాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి కృషి చేస్తున్నప్పటికీ అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న తీవ్రమైన జాత్యహంకార సమస్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియాలోని భారతీయ ట్రక్కు డ్రైవర్లపై జాత్యహంకార దాడులు, దూషణలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అంతేకాదు, వారిని చంపుతామని లేదా అంతకంటే ఘోరంగా హింసిస్తామని చాలా మంది బెదిరింపులకు దిగుతున్నారు.
వలస వెళ్లిన ట్రక్కు డ్రైవర్ల దయనీయ స్థితిని ఏబీసీ న్యూస్ ఓ డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. వీరిలో చాలామందికి ఇప్పటికే ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్నప్పటికీ జాత్యహంకార దూషణలకు గురవుతున్నారు. ఆస్ట్రేలియాలో రవాణా రంగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ట్రక్కులు నడకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సాఫీగా సాగిపోతున్నట్టు కనిపించే ఈ రంగం వెనుక పరిష్కారం లేని ఓ పెద్ద సమస్య దాగి ఉంది.
ఇది వలస డ్రైవర్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాము ఎదుర్కొంటున్న జాత్యహంకార దూషణలను, వ్యవస్థాగత దోపిడీని భారతీయ డ్రైవర్లు ఏబీసీ న్యూస్‌తో పంచుకున్నారు. డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి తాము సేవలను అందిస్తున్నందుకే ఈ వివక్ష ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. ఆస్ట్రేలియా రవాణా రంగంలో ప్రస్తుతం భారతీయ డ్రైవర్లు అత్యంత ముఖ్యమైన వలస శ్రామిక శక్తిగా మారారు.
అయినప్పటికీ వీరు నిరంతరం వేధింపులకు గురవుతున్నారు. పిప్పల్ సింగ్ అనే భారతీయ ట్రక్కు డ్రైవర్ కమ్యూనికేషన్ రేడియో ద్వారా తమకు వచ్చిన బెదిరింపులను రికార్డ్ చేశారు. ‘‘ఇక్కడ త్వరలోనే అంతర్యుద్ధం రాబోతోంది. మేము భారతీయ పురుషులందరినీ చంపేస్తాం. పిల్లలను పాతిపెట్టి, మహిళలను అమ్మేస్తాం. శ్వేతజాతీయుల ఎదుట మురికి భారతీయులు నిలబడలేరు’’ అని ఓ ఆస్ట్రేలియన్ చేసిన బెదిరింపులు అందులో రికార్డయ్యాయి.
అలాగే, ‘మంచి భారతీయుడు అంటే చచ్చినవాడే’ అని మరొకడు మాట్లాడాడు. ఇటువంటి బెదిరింపులతో చాలా మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం రేడియోను ఉపయోగించడం మానేశారు. ‘దీన్ని ఆన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఎటువంటి లాభం లేదు’ అని పిప్పల్ సింగ్ నిర్వేదం వ్యక్తం చేశారు. అలాగే, సోషల్ మీడియాలోనూ డ్రైవర్లను ఎగతాళి చేస్తూ జాత్యహంకార మీమ్స్ షేర్ చేస్తున్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంగా ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా పెరుగుతున్న వలసదారుల సమూహంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. వీరిలో చాలామంది రవాణా రంగంలో దీర్ఘకాలంగా ఉన్న కార్మికుల కొరతను తీరుస్తున్నారు. అంతర్జాతీయ రోడ్డు రవాణా సంఘం అంచనా ప్రకారం.. 2024లో అనుభవజ్ఞులైన డ్రైవర్లు పదవీ విరమణ చేయడం, ఆస్టేలియా యువత ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడంతో సుమారు 28,000 భారీ వాహన డ్రైవర్ల కొరత ఉంది.
అయితే, భారత్‌లో వ్యవసాయం, రవాణా పరిశ్రమతో అనుబంధం కారణంగా, చాలా మంది సిక్కు, పంజాబీ వలసదారులకు ట్రక్కు డ్రైవింగ్ సహజంగానే అలవడింది. ‘ఇది నా రక్తంలోనే ఉంది’ అని జస్విందర్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపారు. ‘ఇండియాలో మా నాన్నకు సొంత రవాణా సంస్థ ఉండేది, అందుకే నాకు మొదటి నుంచీ ట్రక్కులంటే చాలా ఇష్టం’’ అని ఆయన చెప్పారు.
కాగా, భారతీయ వలస డ్రైవర్లు ట్రాఫిక్ పరిస్థితులు, ప్రమాదాల గురించి భద్రతా సమాచారాన్ని పంచుకోవడానికి సాధారణంగా ఉపయోగించే సీబీ రేడియోలో ఇతరుల నుంచి దూషణలు వినవలసి వస్తుంది. ఈ సంఘటనలు వారిని అప్‌డేట్‌లను పంచుకోవడానికి లేదా దానిని వినడానికి కూడా సంకోచించేలా చేస్తాయి.
రేడియోల పరిధి 30 కిలోమీటర్ల మేర ఉండటంతో జాత్యహంకార దూషణలు క్షణాల్లో జరిగిపోతాయి. పైగా దూషించేవారు తమ గుర్తింపును దాచుకోవడం వల్ల అధికారులకు ఫిర్యాదు చేయడం మరింత కష్టమవుతుంది. దీనిపై మొనాష్ విశ్వవిద్యాలయం వర్క్‌ప్లేస్ హెల్త్, సేఫ్టీ ప్రొఫెసర్ సారా ఆండర్సన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో వలస డ్రైవర్లపై జరుగుతున్న జాత్యహంకార దూషణలు, దాడుల గురించి సరైన సమాచారం లేదని, కానీ అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

More Stories
ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత!
‘మా తండ్రి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’.. మోజ్తాబా శపథం
నౌకాదళంలోకి మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి