పశ్చిమ బెంగాల్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తిరిగి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వంక ఎమ్యెల్యేలు,ఎంపీలు తిరుగుబాటు జరపడంతో పార్టీ కార్యాలయాలను సహితం కోల్పోవాల్సి వస్తుండగా, తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రూ.440 కోట్లు ఉన్న బ్యాంక్ అకౌంట్లను ఇవాళ ఈడీ జప్తు చేసేసింది.
దీంతో మమతా బెనర్జీ పార్టీకి ఈ నిధులు వాడుకునే అవకాశం లేకుండా పోయింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మూడు బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మూడు హెచ్డిఎఫ్సీసి బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ. 440.42 కోట్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది.
పార్టీ నిధుల ద్వారా భారీ స్థాయిలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగాయని, మనీ లాండరింగ్, నిధుల దుర్వినియోగానికి సంబంధించి వీటిపై దర్యాప్తు జరుగుతోందని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ ప్రాంతాలన్నీ విమానయాన రంగంలో కార్యకలాపాలు సాగించే కేర్వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించినవే.
ఏప్రిల్ 2023, జూన్ 2026 మధ్య కాలంలో తృణమూల్ ఖాతాల నుండి కేర్వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు, దానికి అనుబంధంగా ఉన్న మరో కంపెనీకి సుమారు రూ.160 కోట్లు బదిలీ అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత, కేర్వెల్ ఏవియేషన్ సంస్థ సుమారు రూ.82.96 కోట్లను కొత్తగా ఏర్పాటైన ఒక అనుబంధ కంపెనీ ఖాతాలకు పంపిందని ఈడీ పేర్కొంది.
ఈ నిధులలో అధిక భాగాన్ని ఎంబ్రాయర్ లెగసీ 600 విమానం, అగస్టా 109 ఎస్పీ హెలికాప్టర్ కొనుగోలుకు వాడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ రెండింటి కొనుగోలుకు మొత్తం రూ.112 కోట్లు ఖర్చు చేశారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోలులో కొంత విదేశీ నిధులను కూడా ఉపయోగించారని, అయితే అందులో ఎక్కువ భాగం నేరుగా తృణమూల్ ఖాతాల నుండే వచ్చాయని కూడా ఈడీ చెబుతోంది. దీనిపై టీఎంసీ ఇంకా స్పందించలేదు.
ఒక పెద్ద సైబర్ మోసం ద్వారా వచ్చిన సొమ్మును కొన్ని టీఎంసీ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపిస్తూ జూన్లో దాఖలైన ఒక ఫిర్యాదు తర్వాత ఈ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభమైంది.

More Stories
అదానీ షాపుల్లో నికోటిన్ పౌచ్ల అమ్మకంపై దుమారం
భారీ నష్టాల్లోకి స్టాక్మార్కెట్లు.. రూ 8 లక్షల కోట్లు ఆవిరి
టిఎంసి బ్యాంకు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు