గణనీయంగా తగ్గిన విద్యార్థుల స్కూల్ డ్రాప్‌అవుట్ రేటు

గణనీయంగా తగ్గిన విద్యార్థుల స్కూల్ డ్రాప్‌అవుట్ రేటు

2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల స్కూల్ డ్రాప్‌అవుట్ రేటు గణనీయంగా తగ్గగా, సెకండరీ స్థాయిలో చేరికలు, కొనసాగింపు రేట్లు మెరుగుపడ్డాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సంఖ్య తొలిసారిగా 1.02 కోట్ల మార్కును దాటిందని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూడైస్ ప్లస్ (యుడైస్+) 2025-26 నివేదిక వెల్లడించింది.  ప్రిపరేటరీ స్థాయిలో 2024-25లో 2.3 శాతంగా ఉన్న డ్రాప్‌అవుట్ రేటు 2025-26లో 1.8 శాతానికి తగ్గింది.

సెకండరీ స్థాయిలో ఇది 8.2 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది. అన్ని స్థాయిల్లోనూ ఈ తగ్గుదల కనిపించడం విద్యార్థులను చదువులో కొనసాగించే ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని విద్యాశాఖ పేర్కొంది. మిడిల్ స్థాయిలో విద్యార్థుల రిటెన్షన్ రేటు 82.8 శాతం నుంచి 83.7 శాతానికి పెరిగింది. సెకండరీ స్థాయిలో ఇది 47.2 శాతం నుంచి 51.9 శాతానికి చేరింది. అయితే ఫౌండేషన్, ప్రిపరేటరీ స్థాయిల్లో మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది.

అయినప్పటికీ గత మూడేళ్లలో నమోదైన పురోగతి కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సెకండరీ విద్య అందించే పాఠశాలల సంఖ్య పెరగడం వల్ల విద్యార్థులకు చదువు అందుబాటులోకి రావడంతో పాటు మధ్యలోనే చదువు మానేయకుండా కొనసాగించే అవకాశం పెరిగిందని విద్యాశాఖ తెలిపింది. ఇదే రిటెన్షన్ రేటు మెరుగుపడటానికి ప్రధాన కారణంగా పేర్కొంది. 

సెకండరీ స్థాయిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జిఈఆర్) కూడా గణనీయంగా పెరిగింది. 2024-25లో 68.5 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025-26లో 71.7 శాతానికి చేరింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత తరగతుల్లో చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య తొలిసారిగా 1.02 కోట్లను దాటింది. 2022-23తో పోలిస్తే 2025-26లో ఉపాధ్యాయుల సంఖ్య 8.3 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

ఉపాధ్యాయుల పెరుగుదలతో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి మెరుగుపడటంతో పాటు ప్రాంతాల మధ్య ఉన్న కొరతను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇక కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పిజిఐ) 2025-26 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరులో చండీగఢ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది.  చండీగఢ్ ఒక్కటే ‘ఉత్తమ్-3’ గ్రేడ్ సాధించింది.

పంజాబ్, కేరళ, దిల్లీతో పాటు దాద్రా నగర్ హవేలీ-దమన్ అండ్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతం తదుపరి స్థాయిలో నిలిచాయి. అయితే ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం కూడా అత్యున్నత ‘ఉత్కర్ష్’, ‘ఉత్తమ్-1’, ‘ఉత్తమ్-2’ గ్రేడ్లను అందుకోలేకపోయింది. జిల్లాల వారీగా పరిశీలించినప్పటికీ అత్యున్నత ‘ఉత్కర్ష్’ గ్రేడ్ ఏ జిల్లాకూ దక్కలేదు. అయితే ఒక జిల్లా ‘ఉత్తమ్-1’, 19 జిల్లాలు ‘ఉత్తమ్-2’ గ్రేడ్ సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే మంచి గ్రేడ్ సాధించిన జిల్లాల సంఖ్య పెరిగినట్లు నివేదిక తెలిపింది.