జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే బిజెపి లక్ష్యం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే బిజెపి లక్ష్యం
రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యమని, ఇందుకోసం ప్రతి కార్యకర్త విజయమే ఏకైక లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
బిజెపి రంగారెడ్డి జిల్లా (అర్బన్) కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ రంగారెడ్డి జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్, ప్రజల ఆదరణ ఉన్నాయని, ఈ జిల్లాలో విజయం సాధించడానికి అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈసారి హైదరాబాద్ వ్యాప్తంగా 100% ఫలితాలు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. 
 
ఎన్నికల్లో గెలుపే ఏకైక కొలమానమని, ద్వితీయ, తృతీయ స్థానాల గురించి కాకుండా కేవలం విజయాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.
పార్టీలో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఉండటం సహజమని, అయితే పార్టీని తల్లిగా భావించి క్రమశిక్షణతో ఐక్యమత్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. “యూనిటీ ఈజ్ స్ట్రెంత్” (ఐక్యమత్యమే మహాబలం) అనే సూత్రాన్ని నమ్మి, వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షల కంటే పార్టీ విస్తృత ప్రయోజనాలే ముఖ్యమని భావించాలని చెప్పారు. 
 
టికెట్ ఎవరికి వచ్చినా, జెండాను, పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయని, అందరికీ భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, అవినీతిపై బూత్, మండల స్థాయి నుంచి బలమైన ఉద్యమాలను నిర్మించాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. 
 
జిల్లా వ్యాప్తంగా స్థానిక సమస్యలను గుర్తించి, రాష్ట్ర పార్టీతో సమన్వయం చేసుకుంటూ నిరంతర పోరాటాలు చేయాలని రామచందర్ రావు చెప్పారు.  తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల పరిపాలనను చూసి విసిగిపోయారని, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపే చూస్తున్నారని వివరించారు.  ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా ప్రతి నాయకుడు, కార్యకర్త బూత్ స్థాయి ఏజెంట్లతో (బిఏఏ) కలిసి ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. ఓటర్ల జాబితాను సరిచూసుకోవడం, కొత్త ఓట్ల నమోదు, స్థానిక ఓటర్లతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన తెలిపారు.