మహారాష్ట్రలో పెను విషాదం సృష్టిస్తున్న కుండపోత వర్షాలు

మహారాష్ట్రలో పెను విషాదం సృష్టిస్తున్న కుండపోత వర్షాలు

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విషాదాన్ని సృష్టించాయి. పుణే జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరోవైపు, ఈ విపత్తు కారణంగా ముంబై-పుణే మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. 

భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో గత రెండు రోజులుగావర్ష సంబంధిత ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చెట్లు కూలిన ఘటనల్లో ఇద్దరు, ఆదివారం మన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఒక భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు.  మూడువైపులా నీరుండే ముంబై నగరం నాలుగోవైపు సంబంధాలు తెగిపోవడంతో ద్వీపంలా మారింది.

ముంబై-పుణె, ముంబై-అహ్మదాబాద్, ముంబై-కొంకణ్‌ రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ప‌డింది. పుణే జిల్లాలో  30 నుంచి 35 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తుండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గ్రామంలో మూడు వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, ఒక ఘటనలో ఇల్లు కూలి ముగ్గురు మరణించారని డీఎస్పీ గజానన్ టోంపే తెలిపారు.

పుణేలోని 5వ బెటాలియన్‌కు చెందిన 30 మంది సభ్యుల ప్రత్యేక బృందం సహాయక చర్యలు చేపట్టిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.  కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే, పాత ముంబై-పుణే హైవేలపై వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు. 

ప్రతికూల వాతావరణం దృష్ట్యా అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. రెండు నెలల క్రితమే ప్రారంభమైన  ట్రాఫిక్‌ అంతరాయాలను తొలగించేందుకు  రూ.6,695 కోట్లతో నిర్మించిన13 కిలోమీటర్ల ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే మిస్సింగ్ లింక్ మార్గంలో కూడా రాకపోకలు ప్రభావితమయ్యాయి. 

ఇందులో రెండు సొరంగాలు (1.6 కి.మీ., 8.9 కి.మీ.) ఉన్నాయి. ఈ సొరంగ మార్గాన్ని 9 వారాల కిందట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న‌వీస్‌ ప్రారంభించారు. సోమవారం 3.30 గంటల సమయంలో సొరంగం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. విప‌త్తు నిర్వ‌హ‌ణ సిబ్బంది ఏకంగా 18 గంటల పాటు శ్రమించి ఈ మార్గాన్ని పునరుద్ధరించారు.

మరోవైపు, భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ః జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు, గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.