* వైసిపి, వామపక్షాలతో కలిసి ఏర్పరచాలని చూస్తున్నాయని సినీ నటుడు నరేష్ హెచ్చరిక
తమిళనాడులో చడీచప్పుడు లేకుండా నటుడు జోసెఫ్ విజయ్ ను ఓ కీలక రాజకీయ శక్తిగా మలచి, ఏకంగా ప్రభుత్వం ఏర్పర్చేటట్లు చేసిన విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో సహితం సరికొత్త రాజకీయ సమీకరణలకు క్రైస్తవ శక్తులు ప్రయత్నాలు ప్రారంభించాయా? అవునని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైసీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ ఎక్స్ లో చేసిన వరుస పోస్టులు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షునిగా, బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన ఆయన గత 16 ఏళ్లకు పైగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభతో పాటుగా జైభీమ్ పార్టీ అధినేత, లాయర్ జడ శ్రవణ్ కుమార్‌పై ఆయన చేసిన పోస్టులు ఈ దిశలో సంకేతాలు ఇస్తున్నాయి.
ఏలూరు సభలో ప్రసంగాలు, ఆ తర్వాత నమోదైన కేసులు, అరెస్ట్‌లు అంటూ ఆయన స్పందించారు. నటుడు నరేష్ పరోక్షంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ ఓట్ల కోసం జరుగుతున్న ఓ రాజకీయ వ్యూహంగా ఆయన చెప్పుకొచ్చారు. నరేష్ తాజాగా ఈ నెల 1న తాను చేసిన పోస్టును గుర్తు చేశారు.
“ఐదు రోజుల క్రితం నేను ఈ ట్వీట్ చేసినప్పుడు, తమిళనాడు ఎన్నికలపై నా అంచనాలాగే ప్రజలు నన్ను తేలికగా తీసుకున్నారు. ఈ రోజు ఈ విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని వెనుక మత, రాజకీయ కుట్ర ఉందని నేను స్పష్టంగా చెప్పాను. గుండెపోటుకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు, ఇతరులు.. ప్రశ్న, జడ శ్రవణ్ అండ్ టీమ్‌కు పూర్తి మద్దతుగా ముందుకు వచ్చారు” అంటూ స్పష్టం చేశారు.
“నేను ఏ పార్టీ మద్దతు తెలియజేయడం లేదు. కానీ ఈ పరిణామాలను అధ్యయనం చేస్తున్న ఒక రాజకీయ పరిశీలకుడిని మాత్రమే. ఇప్పటికైనా మేల్కొనండి. రాష్ట్రం మాత్రమే కాదు, దేశం మొత్తం ఈ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వెయిట్ అండ్ సీ.. ఊరికే చెబుతున్నాను” అంటూ నరేష్ హెచ్చరించారు.
నరేష్ ఈ నెల 1న చేసిన పోస్టులో ‘జైభీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ అండ్ టీమ్ తీవ్రమైన మత, రాజకీయ ప్రచారం, ఆ తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్‌లు, అరెస్టులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే అధికారి కూటమిని సవాల్ చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్రైస్తవ, దళిత ఓట్లను ఆశించేందుకు మరో రాజకీయ పార్టీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని మార్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ఆయన తేల్చి చెప్పారు.
“ఇది ఒక గుండెపోటుకు ముందుగా వచ్చే హెచ్చరిక వంటిది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, రాబోయే ఎన్నికలు సిద్ధాంతాలకు, ధర్మానికి మధ్య పోరుగా.. రాజకీయ రంగంలో ఒక కలియుగ మహాభారతంగా మారే అవకాశం ఉంది. గతంలో నేను చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఈ అంశాలను గమనిస్తూ ఉండండి” అంటూ నరేష్ సూచించారు. ఒకటిన్నర దశాబ్దాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న నరేష్ అకస్మాత్తుగా ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపడం మరోవంక ఆసక్తి కలిగిస్తోంది.

More Stories
విరాళాల చోరీ నెపంతో రామ మందిర్ ట్రస్ట్ లో ప్రభుత్వ జోక్యం తగదు!
చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం.. కొత్త సారధిగా కృష్ణ మోహన్
రావణ్ ఫోన్లో మావోయిస్టు భావజాలం.. హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు