* విశ్వహిందూ పరిషత్ హెచ్చరిక
విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ తన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించిన రోజునే, ఆలయ వ్యవహారాలను నిర్వహించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సోమవారం స్పష్టం చేసింది. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదన్న తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటించింది.
రామ మందిర వ్యవహారాల నిర్వహణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2020లో కేంద్రం ఏర్పాటు చేసిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’లోని కొందరు సభ్యులు ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశీలనలో ఉన్నారు. ట్రస్ట్ నిర్వాహక సభ్యుల పాత్రలపై దర్యాప్తు జరుగుతుండటంతో, ఆలయ నిర్వహణలో ప్రభుత్వ నియంత్రణను పెంచాలనే సూచనలు, మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
అంతకుముందు, ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలను అధికారికంగా ఆమోదించింది. “రామ మందిరంపై ప్రభుత్వ నియంత్రణ (ప్రభుత్వీకరణ) ఉండటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఏ పరిస్థితుల్లోనూ దీనిని అనుమతించము. రామ మందిరానికే కాకుండా, ఇతర ఏ హిందూ ఆలయాల విషయంలోనైనా ఇదే మా వైఖరి,” అని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ తేల్చి చెప్పారు.
అయితే, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ)ను నియమించడాన్ని వీహెచ్‌పీ వ్యతిరేకించడం లేదని జైన్ పేర్కొన్నారు. “రామ మందిర దైనందిన వ్యవహారాలను నిర్వహించడానికి ఒక నిపుణుడిని నియమించడాన్ని మేము వ్యతిరేకించము, కానీ ఆ వ్యక్తి అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారి (బ్యూరోక్రాట్) అయి ఉండకూడదు. ప్రభుత్వానికి కాకుండా ట్రస్ట్‌కు జవాబుదారీగా ఉండాలి,” అని జైన్ చెప్పారు.
సిఈఓ నియామకం ప్రభుత్వం ద్వారా కాకుండా ట్రస్ట్ ద్వారానే జరగాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న శబరిమల ఆలయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న బంగారు ఆభరణాల చోరీ ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు; ఆ ఘటనపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది.
“ప్రజలచే చక్కగా నిర్వహించబడుతున్న లక్షలాది ఆలయాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆలయాల పరిస్థితి ఎలా ఉందో కూడా చూడండి,” అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో ఆలయ నిర్వహణకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆలయ నిర్వహణపై ప్రభుత్వానికి నియంత్రణ అధికారాన్ని కల్పించే చట్టాలు ఉన్నాయి.
హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి వీహెచ్‌పీ 2021 నుండి దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఆ సమయంలో, సుమారు 20,000 నుండి 50,000 దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని వీహెచ్‌పీ పేర్కొంది. ఇదేసమయంలో , రామమందిరంలో విరాళాల చోరీకి సంబంధించిన వ్యవహారం, ఆలయ నిర్వహణ ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలని వాదించే ప్రతిపక్షాలకు, కొంతమంది నిపుణులకు బలమైన ఆయుధంగా మారింది.
రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సహితం ‘తిరుపతి మోడల్’ను, ఆలయ దైనందిన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక సిఈఓ నియామకాన్ని గత నెలలో సమర్థించారు. “ఆ సిఈఓ ట్రస్ట్ (రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్)తో కలిసి పనిచేయాలి. ఎవరూ నియమావళిని లేదా ఉప-నియమాలను మార్చమని అడగడం లేదు, కానీ ఉత్తరప్రదేశ్‌లో పనిచేసిన అనుభవం ఉన్న ఒక సిఈఓ తప్పనిసరిగా ఉండాలి,” అని మిశ్రా స్పష్టం చేశారు.
దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి తగిన చర్యలను సూచించేందుకు, వీహెచ్‌పీ 2024లో సుప్రీంకోర్టు, హైకోర్టుల రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులు, హిందూ మత పెద్దలతో కూడిన ఒక ‘థింక్-ట్యాంక్’ (సలహా బృందం)ను ఏర్పాటు చేసింది. గతంలో, దేవాలయాల నిర్వహణ నుండి ప్రభుత్వాలు తప్పుకోవాలని కోరుతూ వీహెచ్‌పీ అన్ని రాష్ట్రాల గవర్నర్లకు వినతిపత్రాలను కూడా సమర్పించింది.
దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు—ఉదాహరణకు ఝండేవలన్ మందిర్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ఆలయ వ్యవస్థ ప్రైవేట్ ట్రస్టుల ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని జైన్ గుర్తు చేశారు. చంపత్ రాయ్ విషయాన్నీ ప్రస్తావిస్తూ “నేరం రుజువయ్యే వరకు ఎవరినీ దోషిగా పరిగణించకూడదనేది భారత రాజ్యాంగంలోని ఒక ప్రాథమిక సూత్రం” అని తెలిపారు.
“చంపత్ జీ (రాయ్) దోషి అని ఎక్కడ రుజువైంది? దర్యాప్తు సంస్థలను తమ పనిని చేసుకోనివ్వకూడదా? దర్యాప్తు ఫలితం కోసం వేచి చూడాలి కదా?” అని జైన్ ప్రశ్నించారు. “ఆరోపణలు వచ్చిన వెంటనే, కొందరు వ్యక్తులు ఆయనను దోషిగా ప్రకటించడానికి, కఠినమైన శిక్షను డిమాండ్ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, ఆ ఆరోపణలలో చాలా వరకు తప్పు అని తేలాయి. అందుకే ఈ వ్యవహారంపై వాదనలు మారుతూ వస్తున్నాయి. అవును, చంపత్ జీపై ఆరోపణలు వచ్చాయి, కానీ ఆయన ఎక్కడికీ పారిపోలేదు లేదా విచారణను తప్పించుకోలేదు,” అని జైన్ స్పష్టంచేశారు.
భారత చరిత్రలో మొదటిసారిగా, ఒక నిందితుడే స్వయంగా సిట్ ఏర్పాటును డిమాండ్ చేశారని జైన్ పేర్కొన్నారు. “అంతేకాదు, సిట్ ఆయనను పిలిచినప్పుడల్లా అతను హాజరై ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు సహకరించడానికి బదులుగా వాటిని ఎదిరించిన రాజకీయ నాయకులను కూడా మనం చూశాం,” అని ఆయన ఎద్దేవా చేశారు.

More Stories
తమిళనాడు తరహాలో ఏపీలో కొత్త రాజకీయ శక్తిగా క్రైస్తవ సంఘాలు!
చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం.. కొత్త సారధిగా కృష్ణ మోహన్
రావణ్ ఫోన్లో మావోయిస్టు భావజాలం.. హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు