విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో, రామమందిర ట్రస్ట్ సోమవారం నాడు తన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్,సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించింది. రామ మందిర ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కోశాధికారి గోవింద్ గిరి ప్రకటించారు. 74 ఏళ్ల వయసున్న మోహన్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మాజీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి.
వ్యవస్థాపక సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ మరణం తర్వాత గత సెప్టెంబర్ లో ఆయన ట్రస్టీగా నియమితులయ్యారు. హర్దోయ్ జిల్లాకు చెందిన మోహన్, ప్రస్తుతం తూర్పు ఉత్తర ప్రదేశ్‌కు ఆర్ఎస్ఎస్ ‘క్షేత్ర సంఘ్ చాలక్’గా వ్యవహరిస్తున్నారు. కొత్త ట్రస్టీ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు ట్రస్ట్ జూలై 22న మరోసారి సమావేశం కానుంది.
సోమవారం నాడు రామ జన్మభూమి ప్రాంగణంలోని అతిథి గృహంలో ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్‌తో సహా తొమ్మిది మంది శాశ్వత సభ్యులలో ఏడుగురు హాజరయ్యారు. సమావేశం అనంతరం స్వామి గోవింద్ దేవ్ గిరి జీ మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ “రామమందిర్ విరాళాల చోరీ మమ్మల్ని చాలా బాధించింది. పెద్దమొత్తం కాజేశారా? చిన్న మొత్తమా? అనేది రెండో విషయం. అంతకంటే ముఖ్యంగా అలాంటి పవిత్రమైన చోట విరాళాల చోరీ జరగడం మమ్మల్ని క్షోభకు గురి చేస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఏది ఏమైనప్పటికీ, వాస్తవం మన కళ్ల ముందే ఉంది. దాని గురించి లోతుగా ఆలోచించడం మా బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక క్లిష్టమైన పరిస్థితి తలెత్తింది. మా ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ జీ మిశ్రా తమ రాజీనామాలను సమర్పించారు. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చంపత్ రాయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దోషులు పట్టుబడి తగిన శిక్ష పడేంత వరకు, అంటే న్యాయం పూర్తిగా జరిగేంత వరకు తన పదవిలో కొనసాగడం సముచితం కాదని ఆయన భావించారు” అని ఆయన తెలిపారు.
ఆయన రాజీనామాను ఆమోదించడం లేదా తిరస్కరించడం తమ చేతులలో లేడనై చెబుతూ కె. పరాశరన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారని, ట్రస్ట్ రాజ్యాంగం ప్రకారం, రాజీనామా సమర్పించిన క్షణమే అది ఆమోదించబడినట్లుగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. కాగా, జూలై 22వ తేదీన మరోసారి సమావేశం అవుతామని ట్రస్ట్ వెల్లడించింది.
ఈ సమావేశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన తుది నివేదికను సమీక్షిస్తామని, ఆ తర్వాత కొత్త సభ్యులను, కార్యవర్గాన్ని నియమిస్తామని తెలిపింది. అప్పటివరకూ మధ్యంతర కార్యదర్శి కృష్ణ మోహన్ అన్ని బాధ్యతలు చూసుకుంటారని ట్రస్ట్ స్పష్టం చేసింది. కాగా రాజీనామా చేసిన చంపత్ రాయ్, మిశ్రా ఆ సమయంలో ఆలయంలోనే ఉన్నప్పటికీ ట్రస్ట్ సమావేశానికి హాజరు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
“కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించే వరకు తాత్కాలిక ప్రాతిపదికన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించే బాధ్యతను నాకు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎవరైనా దోషులుగా తేలితే, న్యాయం ప్రకారం వారికి తగిన శిక్ష పడేలా చూడాలని మేము గట్టిగా పట్టుబడతాం. జరిగిన పరిణామాల పట్ల మేమంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. రామ భక్తులతో సహా అందరూ బాధపడ్డారు” అని కృష్ణ మోహన్ తెలిపారు.
“నిర్వహణ, కార్యకలాపాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని ఇతరులు తమకు అనుకూలంగా వాడుకున్నారు. కాబట్టి, ఆ లోపాలను సరిదిద్దడం, తప్పులను సరిచేయడం నా ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు నేను అన్ని విధాలా కృషి చేస్తాను. నెలకొన్న పరిస్థితులు మా ట్రస్ట్ ప్రతిష్టను కొంతమేర దెబ్బతీశాయి. సమాజంలో అపనమ్మక భావనను కలిగించాయి. ఈ ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించి, సమాజంలో తిరిగి నమ్మకాన్ని పెంపొందించడానికి మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం” అని ఆయన హామీ ఇచ్చారు.
ఇలా ఉండగా, ట్రస్ట్ సమావేశానికి ముందు రామ్ లల్లాకు వచ్చిన విరాళాల చోరీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులకు కఠిన శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఈ సున్నితమైన అంశంపై ఎవరూ రాజకీయ లబ్ధి పొందాలని చూడొద్దని ఆయన సూచించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, ఈ నేరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.

More Stories
విరాళాల చోరీ నెపంతో రామ మందిర్ ట్రస్ట్ లో ప్రభుత్వ జోక్యం తగదు!
రావణ్ ఫోన్లో మావోయిస్టు భావజాలం.. హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు
జూన్ లో విద్యుత్ వాహనాల వాటా 12.5 శాతంకు పెరుగుదల