సంఘ్ శాఖ వ్యక్తిత్వ వికాసానికి ఒక ప్రయోగశాల

సంఘ్ శాఖ వ్యక్తిత్వ వికాసానికి ఒక ప్రయోగశాల
 సంఘ్ శాఖ కేవలం రోజువారీ కార్యకలాపాలు జరిగే ప్రదేశం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసానికి ఒక ప్రయోగశాల అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్  అభివర్ణించారు.  స్వయం సేవక్ ల నిర్మాణ ప్రక్రియ ఒక జీవితకాల సాధన అని వర్ణిస్తూ, అది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని ఆయన చెప్పారు.

 
నాగ్‌పూర్‌లోని లక్ష్మీనగర్‌లో గల సైంటిఫిక్ సొసైటీ ఆడిటోరియంలో జరిగిన “డా. హెడ్గేవార్ – ఆధునిక యుగపు శాలివాహన్” అనే యూట్యూబ్ వీడియో బహిరంగ ప్రసార కార్యక్రమంలో  మాట్లాడుతూ  కాలక్రమేణా ఏ సంస్థ పని అయినా విస్తరిస్తుంని, దాని కీర్తి పెరుగుతుందని, సమాజంలో విశ్వాసం, గౌరవం కూడా పెరుగుతాయని, అయితే, అటువంటి సమయాల్లో దాని మూల ఆలోచనలను, సూత్రాలను కాపాడుకోవడమే అతిపెద్ద సవాల్ అని ఆయన తెలిపారు. 
 
పని స్వభావం మారవచ్చు, కానీ దాని మూలాధారాలు మారకూడదని స్పష్టం చేశారు.  స్వయంసేవక్ గా మారడం అనేది స్వల్పకాలిక ప్రక్రియ కాదని, అది జీవితకాలం కొనసాగే నిరంతర సాధన అని తెలిపారు.  దీనికి అహంకారాన్ని మాత్రమే కాకుండా, మన స్వభావాన్ని కూడా వదులుకోవాలని, శరణాగతికి సంబంధించిన అహంకారం కూడా మనసులోకి రాకూడదని హెచ్చరించారు. 
 
ఈ సందర్భంగా, ఆయన మిలింద్ రహత్‌గావ్‌కర్  “అసు అమ్హి సుఖే, పత్తర్ పయతీల్” అనే ఆడియో-విజువల్ సిరీస్ 101వ ఎపిసోడ్‌ను విడుదల చేశారు.
ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ రాజేష్ అవచాట్, కార్యదర్శి శ్రీరామ్ పింపలికర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో స్వయంసేవక్ లు హాజరయ్యారు.  ఏదైనా సంస్థ పని విస్తరించినప్పుడు, సమాజంలో దానిపై నమ్మకం, ప్రేమ పెరుగుతాయని ఆయన చెప్పారు. పోరాటం, నిర్లక్ష్యం అనే శకం ముగియడం మొదలవుతుందని, వనరులు అందుబాటులోకి వస్తాయని, ప్రశంసలు వెల్లువెత్తుతాయని డా. భగవత్ వివరించారు.  
 
కానీ ఇది చేతులు కట్టుకుని కూర్చుని, సంతృప్తి చెందే సమయం కాదని చెబుతూ లక్ష్యం పట్ల మన అంకితభావం మునుపటిలాగే బలంగా ఉందా? మన ప్రయత్నాలు సరైన దిశలో సాగుతున్నాయా? అని నిర్ధారించుకోవడానికి నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం అని ఆయన సూచించారు. ఆలోచనలు, సూత్రాలను కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే అర్థం చేసుకోలేమని, వాటిని జీవితంలో ఆచరించాలని చెప్పారు. 
 
ఏదైనా పనిని అర్థం చేసుకోవాలంటే, దాని మూలాల్లోకి వెళ్లడం చాలా అవసరం అని పేర్కొంటూ ఇతరుల నుండి ఆశించే ముందు, మనం ఆదర్శంగా నిలవాలని డా. భగవత్ పేర్కొన్నారు. సంఘ్ పని కేవలం చురుకైన కార్యకర్తలను తయారు చేయడం మాత్రమే కాదని, సంఘ్ విలువలను తమ జీవితాల్లో ఆచరించే వాలంటీర్లను సృష్టించడం అని ఆయన తెలిపారు. 
 
ఒక శాఖ నుండి ఉద్భవించిన స్వయం సేవక్ ప్రతికూల పరిస్థితులలో కూడా తమ సూత్రాలకు కట్టుబడి ఉంటూ సమాజం కోసం పనిచేస్తారని తెలిపారు. చదవడం, వినడం కంటే ప్రత్యక్ష అనుభవం ద్వారా సంఘ్‌ను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఒక స్వయంసేవక్ తన జీవితాంతం నిరంతరం తనను తాను అభివృద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు.
 
దీనికి సమయం, శ్రమల అంకితభావం మాత్రమే కాకుండా, ఒకరి స్వభావం, అహం పట్ల కూడా అంకితభావం అవసరం అని తెలిపారు. అంకితభావం చూపిన తర్వాత కూడా, ‘నేను అంకితభావంతో ఉన్నాను’ అనే అహాన్ని పెంచుకోకూడదని,  ఒక స్వయంసేవక్  కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన జీవితం ఆదర్శంగా ఉండాలని ఆయన చెప్పారు. 
 
సమాజంలో మంచి ప్రవర్తనను ఆదర్శంగా చూపడం ద్వారా కొత్త స్వయం సేవక్ లను సృష్టించడంలోనే నిజమైన క్రియాశీలత ఉందని పేర్కొన్నారు.  భారతదేశం, విదేశాల నుండి చాలా మంది ప్రజలు సంఘ్ పనిని గమనించడానికి వస్తారని, తమ దేశాల యువతకు కూడా సమాజం కోసం అంకితభావంతో పనిచేసేలా సంఘ్ శిక్షణ ఇవ్వగలదా? అని వారు అడుగుతారని డా. భగవత్ తెలిపారు. 
 
సంఘ్ గురించి ఉన్న ఒక ప్రసిద్ధ అపోహను కూడా ఆయన ప్రస్తావిస్తూ సంఘ్ ఏ సంస్థను లేదా వ్యవస్థను ‘రిమోట్ కంట్రోల్’తో నియంత్రించదని స్పష్టం చేశారు. వివిధ రంగాలలో పనిచేసే సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని చెబుతూ సంఘ్  ప్రాథమిక పని కేవలం వ్యక్తులను తీర్చిదిద్దడం,  సమాజానికి అంకితమైన స్వచ్ఛంద సేవకులను సృష్టించడం అని తెలిపారు.