పాకిస్థాన్ ప్రభుత్వ అండతో నడుస్తున్న ఉగ్రవాద వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కశ్మీరీలకు మొదటగా ఆయుధాలు సరఫరా చేసింది పాకిస్థాన్ సైన్యమేనని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఆరోపించారు. స్వయంగా పాక్ ఆర్మీయే స్థానికులకు తుపాకులిచ్చిందని, ఇప్పుడు వారినే ఉగ్రవాదులుగా ముద్రవేస్తోందని ఆయన మండిపడ్డారు.
జూన్ రెండో వారం నుంచి పీఓకేలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు గురువారం 24వ రోజుకు చేరుకున్నాయి. గురువారం రావల్కోట్ ఈద్గావ్ మైదానంలో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో మాట్లాడుతూ “పాకిస్థాన్ సైన్యమే స్వయంగా కాశ్మీరీల చేతులకు తుపాకులు ఇచ్చింది. కానీ ఈ రోజు, మమ్మల్ని ఉగ్రవాదులు అని పిలిచే ధైర్యం వారికి వచ్చింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, స్థానిక పాలనా యంత్రంగానికి, ఉగ్రవాదులకు మధ్య గల సంబంధాలను పేర్కొంటూ గతేడాది ఫిబ్రవరిలో జరిగిన జైషే మొహమ్మద్ కార్యక్రమాన్ని ఖాన్ ప్రస్తావించారు. ఆ ర్యాలీలో సాయుధ నిరసనకారులు ఎల్ఎమ్జీ, ఏకే-47 రైఫిల్స్, కత్తుల వంటి ప్రమాదకరమైన ఆయుధాలతో నగరంలో మార్చ్ నిర్వహించారని గుర్తుచేశారు. ఈ ర్యాలీకి రావల్కోట్ డిప్యూటీ కమిషనర్ భద్రతను కల్పించారని ఆయన ఆరోపించారు.
‘‘రావల్కోట్ డిప్యూటీ కమిషనర్ మీకు గుర్తుందా? ఇక్కడ తుపాకులు, కత్తులతో ర్యాలీలు నిర్వహించేవారు. ఇప్పుడు మమ్మల్ని ఉగ్రవాదులని అంటారు. ఈ ప్రజలందరూ (నిరసనకారులు) ఈ నేలకు వారసులు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమం 38 డిమాండ్లను అంగీకరించి, అమలు చేయకపోతే, ఈ సమస్య కేవలం వాటికే పరిమితం కాదని, పీఓకేను పూర్తిగా ఖాళీ చేయాలని డిమాండ్ చేసే ఉద్యమంగా మారుతుందని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అమన్ ఖాన్ హెచ్చరించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాజా వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ నిరసనలలో ప్రదర్శనకారులు మరిన్ని హక్కులు, ఆర్థిక ఉపశమనం, పరిపాలనా సంస్కరణలను డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో పాకిస్తాన్ అధికారానికి ఎదురవుతున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటిగా ఈ ఉద్యమం ఆవిర్భవించింది.
రెండు రోజుల కిందట పాక్ నియంత్రణను సహించబోమని నిరసనకారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాము ఇకపై పాకిస్థాన్ నియంత్రణలో ఉన్నట్లు తాము భావించబోమని, భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటామని హెచ్చరించారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదని, మా అవసరం ఇస్లామాబాద్‌కే ఎక్కువ ఉందని ఖాన్ పేర్కొన్నారు.
కాగా, ఈ నిరసనలు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌కే పరిమితం కాలేదు, విదేశాల్లోని దాని మద్దతుదారులు పలు దేశాల్లోని పాక్ దౌత్య కార్యాలయాల వెలుపల ప్రదర్శనలు నిర్వహించారు.

More Stories
తక్షశిలలో ‘పునర్నిర్మాణాల’పై పాక్ కు యునెస్కో అభ్యంతరం
ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలి
అమెరికా హోటల్ అగ్నిప్రమాదంలో గుజరాత్ కుటుంబం మృతి