వేదకాలం నాటి తక్షశిలలోని పునర్నిర్మాణాలపై పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో) అభ్యంతరం వ్యక్తం చేసింది. చారిత్రక ప్రదేశాల సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న పునర్నిర్మాణాలను వెనక్కి తీసుకోవాలని కోరింది. అలా చేయని పక్షంలో వాటిని యునెస్కో ‘ప్రమాదకర జాబితా’లో చేరుస్తామని ఇస్లామాబాద్‌ను హెచ్చరించింది.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న తక్షశిల, రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దక్షిణ ఆసియాలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ప్రాంతంలో, ప్రాచీన నివాసాలు, బౌద్ధ మఠాలు, విద్యా కేంద్రాల అవశేషాలు ఉన్నాయి. వేదకాలం నాటి ఈ నగరం ప్రస్తావన రామాయణ, మహాభారతాల వంటి హిందూ ఇతిహాసాలలో ఉంది.
ఇటీవల కాలంలో జరిగిన అనవసరమైన మార్పులు, చేర్పులను ప్రస్తావిస్తూ మోహ్రా మొరాడు, సిర్కాప్‌లోని చారిత్రక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితా నుంచి తొలగించడానికి తాము వెనుకాడబోమని యునెస్కో స్పష్టం చేసింది. భవిష్యత్తులో చేపట్టే అన్ని పరిరక్షణ పనులు అంతర్జాతీయంగా ఆమోదించిన వారసత్వ పరిరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని యునెస్కో కోరింది.
తక్షశిలలో పంజాబ్ పురావస్తు శాఖ చేపడుతున్న పునర్నిర్మాణ పనులకు సంబంధించిన సమాచారాన్ని, ఫోటోలను ఒక సందర్శకుడు పారిస్‌లోని యునెస్కోలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధితో ఈ ఏడాది మార్చిలో పంచుకున్న తర్వాత వివాదం మొదలైంది. అసలు గోడల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని లేదా వాటి ఎత్తును పెంచుతున్నారని, ఈ చర్యలు ఆ ప్రదేశం ప్రామాణికతను, సమగ్రతను ప్రభావితం చేయగలవని ఆ సందర్శకుడు గమనించారు.
పురాతన గోడల స్థానంలో కొత్తగా ఇటుకలు, రాళ్లతో పనులు చేసినట్లు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు ఉపయోగించిన ఆధునిక నిర్మాణ సామాగ్రి మెరుస్తూ, ఒకే పరిమాణంలో సమానంగా కనిపిస్తూ పురాతన కాలపు అసమాన రాళ్ల కంటే చాలా భిన్నంగా, స్పష్టంగా గుర్తించేలా ఉంది. గత నెలలో యునెస్కో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్, నేషనల్ హెరిటేజ్ అండ్ కల్చరల్ డివిజన్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తక్షశిల మ్యూజియాన్ని సాంకేతికంగా పరిశీలించాయి.
ఈ క్రమంలో మొహ్రా మొరాడు, సిర్కప్‌లకు సంబంధించిన వారసత్వ ప్రభావ అంచనా నివేదికలు, పునరుద్ధరణ పనులకు ముందు, తర్వాత ఉన్న కట్టడాల ఫొటోలతో కూడిన నిర్దిష్ట పత్రాలను సమర్పించాలని యునెస్కో కోరింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో నిర్మాణానికి సిమెంట్ ఉపయోగించడం యునెస్కో నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు హెచ్చరించారు. మరో 24 ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని 1997 నుంచి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ఈ చర్యల వల్ల తన స్వంత విశ్వసనీయతనే దెబ్బతీసుకునే ప్రమాదం ఉంది.

More Stories
పాక్ సైన్యమే కశ్మీరీలకు ఆయుధాలు ఇచ్చి ఉగ్రవాదులు అంటారా?
ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలి
అమెరికా హోటల్ అగ్నిప్రమాదంలో గుజరాత్ కుటుంబం మృతి