అమెరికా హోటల్‌ అగ్నిప్రమాదంలో గుజరాత్‌ కుటుంబం మృతి

అమెరికా హోటల్‌ అగ్నిప్రమాదంలో గుజరాత్‌ కుటుంబం మృతి
అమెరికాలోని ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అక్కడ పనిచేస్తూ నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన భార్యాభర్తలు, వారి కుమార్తె మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గుజరాత్‌లోని ఖేడా జిల్లా నాడియాడ్‌కు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని రెండేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు. 
 
ఒహియోలోని ‘ఎకానో లాడ్జ్’లో హితేష్‌భాయ్‌ పనిచేస్తుండటంతో ఆ కుటుంబం అక్కడ నివసిస్తున్నది. కాగా, గురువారం తెల్లవారుజామున ఆ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ నివసిస్తున్న హితేష్‌భాయ్‌ కుటుంబం మంటలు గమనించి ఆందోళన చెందారు. సహాయం కోసం లాడ్జి ఫ్రంట్ డెస్క్‌కు ఫోన్ చేశారు. మరోవైపు ఫైర్‌ సిబ్బంది ఆ హాటల్‌ వద్దకు చేరుకున్నారు. పలు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. 
 
బాత్‌రూమ్‌ లోపల ఉన్న హితేష్‌భాయ్‌ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దట్టంగా కమ్ముకున్న పొగకు ఊపిరాడక ఆ కుటుంబంలోని ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హితేష్‌భాయ్‌, అతడి భార్య, కుమార్తె మరణం గురించి గుజరాత్‌లోని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.