పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో మైనారిటీల పవిత్ర స్థలాలు, వారసత్వ కట్టడాల రక్షణ ఎంత దయనీయంగా ఉందో చాటిచెప్పేలా మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లాహోర్‌కు సుమారు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫరూరాబాద్‌లో ఏకంగా 125 సంవత్సరాల పురాతనమైన అత్యంత చారిత్రక ‘గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్’ను ఒక స్థానిక వ్యాపారవేత్త రాత్రికి రాత్రే బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేశాడు.
జూన్ 24వ తేదీ రాత్రి జరిగిన ఈ అనాగరిక చర్య స్థానిక సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఉదంతంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సిక్కుల పవిత్ర మందిరంపై పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
“ఫరూరాబాద్‌లో చారిత్రాత్మక గురుద్వారా కూల్చివేత ఉదంతం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. స్థానిక అధికారులు గానీ ‘ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్’ (ఈటీపీబీ) గానీ దీనిపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అత్యంత విచారకరం. పాకిస్థాన్‌లో మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలపై వ్యవస్థీకృతంగా జరుగుతున్న దాడుల్లో ఇది మరొక భాగం” అని ఆయన ధ్వజమెత్తారు.
ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని, కూల్చివేసిన గురుద్వారా భాగాలను యుద్ధప్రతిపాదికన పునర్నిర్మించాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ డిమాండ్ చేసింది. పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం సదరు వ్యాపారవేత్త సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతుల, ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (ఎన్ఓసీ) తీసుకోకుండానే ఈ చారిత్రక కట్టడాన్ని నేలమట్టం చేశాడు.
దీనిపై స్థానిక సిక్కులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేంత వరకు అక్కడి యంత్రాంగం కళ్లు తెరవకపోవడం గమనార్హం. ఈ వివాదం అంతర్జాతీయంగా ముదరడంతో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ కూడా ఇది ఘోర తప్పిదం అంటూనే వ్యాపారి చేసిన పనిపై సీరియస్ అయ్యారు. ఆ ఘటన సిక్కు మైనార్టీలకు పాకిస్థాన్ రక్షణ కల్పించడంలో విఫలమైనట్లు స్పష్టం చేస్తున్నట్లు బీజేపీ నేత అమిత్ మాల్వీయా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కేవలం విధ్వంసం మాత్రమే కాదు అని, వ్యవస్థీకృత నిర్లక్ష్యమని, పాకిస్థాన్‌లో ఉన్న సిక్కు వారసత్వ గుర్తులను కావాలనే ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ కపట వైఖరిని విస్మరించలేమని పేర్కొన్నారు. పాకిస్థానీ ఏజెన్సీలు స్థానిక స్కికులను భారత్‌పైకి రెచ్చగొడుతున్నాయని, మరో వైపు సిక్కు చరిత్ర, విశ్వాసం, గుర్తింపు ఆనవాళ్లను తుడిచి వేసే ప్రక్రియలో పాకిస్థాన్ ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
పాకిస్థాన్ అనుసరిస్తున్న కుటిల్ ఎజెండా అందరికీ తెలుసు అని, సిక్కు మతస్తుల విశ్వాసాలు, వారసత్వాన్ని, హక్కులను కాపాడేది ఎవరో వారికి తెలుసని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌తో పాటు ఆ ఆదేశానికి మద్దతు ఇస్తున్న భారత వ్యవస్థలు రాజకీయం నిర్వీర్యం అవుతాయని, పాక్ చేపట్టిన చర్య ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ సందేశం వెళ్తుందని భావిస్తున్నట్లు మాల్వీయా వెల్లడించారు.
అలాగే పంజాబ్ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి రమేష్ సింగ్ అరోరా ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మైనారిటీల ప్రాథమిక హక్కులను, వారి ఆరాధనా స్థలాలను కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ గురుద్వారా పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఆ భూమి యాజమాన్య హక్కులపై సమగ్ర విచారణ జరపాలని ఔకాఫ్ శాఖను ఆదేశించారు.
ఇదిలా ఉండగా గురుద్వారా పునర్నిర్మాణ ప్రణాళికపై స్థానిక ముస్లిం వ్యాపారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత 80 ఏళ్లుగా ఈ గురుద్వారా ప్రాంగణం పూర్తిగా పాడుబడిపోయిందని, ఆ సమయంలోనే అనేక కుటుంబాలు ఇక్కడ స్థిరపడి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పుడు పునర్నిర్మాణం పేరిట తమను ఖాళీ చేయిస్తే ఉపాధి కోల్పోతామని, కాబట్టి ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని కోరుతున్నారు.

More Stories
భారత్ కు 10 బిలియన్ డాలర్ల జపాన్ పెట్టుబడులు
జూన్‌లో అతి తక్కువ వర్షపాతంతో వ్యవసాయంకు ముప్పు
కాంగ్రెస్ లో చిచ్చు రేపిన `యాదాద్రి’ ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు!