భారీ వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలం

భారీ వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలం
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధువారం నగరంలో ఏకంగా 10 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవగా, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర నరకయాతన అనుభవించారు. ముంబైతో పాటు పరిసర ప్రాంతాలైన థానే, పుణే, రత్నగిరి జిల్లాల్లో కూడా వానలు దంచికొడుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి స్థానిక అధికారులు మరిన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. హార్బర్ లైన్‌లో ఓవర్‌హెడ్ వైర్ తెగిపోవడంతో ముంబై లోకల్ రైలు సేవలకు అంతరాయం కలిగింది.
వర్షాల కారణంగా మూడు విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు. అవన్నీ తిరిగి ముంబైకి చేరుకున్నాయని ఒక అధికారి తెలిపారు. నగరంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. రేపు, ఎల్లుండి కూడా నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు సూచించారు.  వరద సహాయక బృందాలను రంగంలోకి దించి, నీటిని తోడే పంపులను ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. రానున్న 48 గంటల పాటు ముంబైవాసులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
 

సాయంత్రం 6 గంటలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) జారీ చేసిన రుతుపవన నివేదిక ప్రకారం, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య ద్వీప నగరంలో సగటున 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలలో వరుసగా 99 మిల్లీమీటర్లు, 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.