ఈ ఏడాది జూన్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1.94 లక్షల కోట్లు దాటింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 13.9 శాతం పెరిగాయి. ముఖ్యంగా దిగుమతులపై వచ్చే పన్ను రాబడి గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. 2026 జూన్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,94,812 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం జూన్‌లో ఈ మొత్తం రూ.1,71,105 కోట్లుగా ఉంది.
ఈ పెరుగుదలలో దిగుమతులపై వచ్చే జీఎస్టీ వాటానే అధికం. దిగుమతులపై పన్ను రాబడి ఏకంగా 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లకు చేరుకుంది. అయితే దేశీయ లావాదేవీల ద్వారా సమకూరిన జీఎస్టీ ఆదాయం మాత్రం 6.5 శాతం వృద్ధితో రూ.1,34,774 కోట్లుగా నమోదైంది. దేశీయ వసూళ్ల వృద్ధిరేటు కంటే దిగుమతులపై వసూళ్ల వృద్ధిరేటు ఎక్కువగా ఉండటం గమనార్హం.
రిఫండ్ల తర్వాత ప్రభుత్వానికి అందిన నికర జీఎస్టీ ఆదాయం జూన్‌లో 11.2 శాతం వృద్ధితో రూ.1,62,377 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో నికర వసూళ్లు రూ.1,45,984 కోట్లుగా ఉన్నాయి. ఈసారి మొత్తం రిఫండ్లు కూడా దాదాపు 30 శాతం పెరిగి రూ.32,436 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో దేశీయ రిఫండ్లు 42.9 శాతం పెరిగి రూ.17,767 కోట్లకు చేరాయి.
ఎగుమతులపై ‘ఐస్గేట్’ ద్వారా ఇచ్చిన రిఫండ్లు 15.6 శాతం పెరిగి రూ.14,669 కోట్లుగా ఉన్నాయి. ఇక నికర ఆదాయాన్ని విశ్లేషిస్తే.. దేశీయ లావాదేవీలపై వచ్చిన నికర జీఎస్టీ రాబడి కేవలం 2.6 శాతం మాత్రమే పెరిగి రూ.1,17,007 కోట్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతులపై వచ్చిన నికర కస్టమ్స్ జీఎస్టీ ఆదాయం ఏకంగా 42.2 శాతం పెరిగి రూ.45,370 కోట్లకు చేరింది.
ఇది దిగుమతులపై ఆధారపడి పన్ను వసూళ్లు ఎంతగా పెరిగాయో స్పష్టం చేస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) గణాంకాలను పరిశీలిస్తే స్థూల జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం వృద్ధితో రూ.6,31,699 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ వసూళ్లు రూ.5,82,542 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో నికర జీఎస్టీ రాబడి 7.1 శాతం పెరిగి రూ.5,40,218 కోట్లుగా నమోదైంది. మే నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లుగా నమోదవగా, జూన్‌లోనూ అదే స్థాయి వసూళ్లు కొనసాగడం ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు సూచికగా నిపుణులు భావిస్తున్నారు.
More Stories
ఉక్రెయిన్ దాడులతో రష్యాలో ఇంధన కొరత.. భారత్ నుంచి పెట్రోల్
వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ తో సైబర్ నేరాలు?.. కేంద్రం బ్రేకులు
రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ అధికారి రూ. 169 కోట్ల బ్యాంకింగ్ స్కామ్‌లో అరెస్ట్