శ్రీశైలం వెళ్లే పర్యాటకులు, భక్తులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమలలో 3 నెలల పాటు ప్రవేశంపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జంగిల్ సఫారీ, పుణ్యక్షేత్రాల సందర్శన ఉండదు. పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో అటవీశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీసీఏ ఆదేశాల మేరకు టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ మార్గాల్లోకి ప్రజలను అనుమతించరు.
ఈ సమయంలో జంగిల్ సఫారీలను పూర్తిగా నిలిపివేశారు. భక్తులు, పర్యాటకులు అధికారులకు సహకరించి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచనలు అందుతున్నాయి. నల్లమల అభయారణ్యం పరిధిలోని అనేక పర్యాటక ప్రాంతాలు, ఆలయాల సందర్శనపై నిషేధం విధించారు. ముఖ్యంగా మార్కాపురం, ఆత్మకూరు, నంద్యాల డివిజన్లలో సఫారీలు నిలిపివేశారు.
ఇష్టకామేశ్వరీదేవి ఆలయం, రుద్రకోడూరు క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాలకు భక్తుల రాకపోకలను మూడు నెలల పాటు అనుమతించరు. వన్యప్రాణుల ఏకాంతానికి భంగం కలగకుండా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బఫర్ ఏరియాలోని ఎకో టూరిజం వసతులు తప్ప మిగిలిన అటవీ ప్రాంతాల్లో పర్యటనలు ఉండవు.
నల్లమల అడవిలో నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం ఉంది. గతంలో 85 పులులు ఉండగా.. గతేడాది ఆ సంఖ్య 90కి చేరింది. వీటిలో 32 మగ పులులు, 40 ఆడ పులులు ఉన్నాయి. పిల్లలు 14, అవయవ నిర్ధారణ కానివి 4 ఉన్నాయి. ప్రతి ఏటా జులై సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో పులులు సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. కాబట్టి పులులకు ఏకాంతం కల్పిస్తూ ఈ ఆంక్షలు విధిస్తున్నారు. ఒకవేళ వాటి ఏకాంతానికి ఇబ్బంది కలిగిస్తే దాడి చేస్తాయి.
అటవీ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా మూడు నెలల పాటు నిషేధం అమలు చేస్తున్నారు. చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు వంటి ఇతర వన్యప్రాణుల రక్షణ కూడా ఈ ఆంక్షల ఉద్దేశ్యం. మార్కాపురం అటవీ డివిజన్, ఆత్మకూరు అటవీ డివిజన్, నంద్యాల డివిజన్లోని సఫారీ నిలిపివేశారు. పర్యాటకులు, స్థానికులు ఈ నియమాలను పాటిస్తూ అటవీశాఖకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

More Stories
ఏపీలో డ్వాక్రా సంఘాలపై విచారణకు బిజెపి డిమాండ్
కర్నూలు జిల్లాలో భారతదేశపు మొదటి ప్రైవేట్ బంగారు తవ్వకం
తొలిసారి సముద్ర మార్గంలో సింగపూర్‌కు ఆంధ్రా మామిడి!