ప్రతిపక్షాల ఐక్యతను చాటుతూ, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్) ప్రక్రియ పక్షపాతపూరితంగా, లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తూ ఒక స్వతంత్రం ఎంపీ కపిల్ సిబాల్ తో పాటు 23 ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ సూర్యకాంత్‌కు ఉమ్మడి వినతిపత్రాన్ని సమర్పించాయి.
‘ఇండియా’ కూటమి ఈ లేఖలోని వివరాలను బహిర్గతం చేయనప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ప్రక్రియపై కూడా ఇందులో ఆందోళనలు వ్యక్తం చేసినట్లు సమాచారం. జూన్ 8న జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశానికి హాజరుకాని డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ లేఖపై సంతకాలు చేశాయి. ఆప్ ‘ఇండియా’ కూటమిలో భాగం కాదు.
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ (కూటమిలోని ఒక భాగస్వామి) తమకు “ద్రోహం” చేసిందని ఆరోపిస్తూ, ఆ సమావేశానికి హాజరుకావడం లేదని డీఎంకే ముందే తెలియజేసింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఆరోపణపై స్పందించనప్పటికీ, అవసరమైనప్పుడు డీఎంకే తప్పక వచ్చి ప్రతిపక్షంతో కలిసి నిలబడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
సీజేఐకి సంయుక్త లేఖ పంపాలని ఇండియా కూటమి సమావేశం తీర్మానించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టుబట్టడంతో ఈ సమావేశం జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కింద లక్షలాది మంది చట్టబద్ధమైన ఓటర్ల ఓటు హక్కును హరించడం, ఆ రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఓటమికి కారణమైన అంశాలలో ఒకటి అని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.

More Stories
అయోధ్యలో సిసిటివిలు పర్యవేక్షించే ఆర్ఎంఓ అర్జున్ దేవ్ బదిలీ
32 ఏళ్ల తర్వాత యమునా జలాల ఒప్పందం
చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు స్థిరం, సున్నితం