చైనా బిలియ‌నీర్‌కు అమెరికాలో 30 ఏళ్ల జైలుశిక్ష

చైనా బిలియ‌నీర్‌కు అమెరికాలో 30 ఏళ్ల జైలుశిక్ష

చైనా బిలియ‌నీర్ గువో వెంగుయికి 30 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ అమెరికాలోని మ‌న్‌హ‌ట‌న్ జిల్లా కోర్టు జ‌డ్జీ అనాలిసా టోరిస్ తీర్పును వెలువ‌రించారు.   బిలియ‌న్ డాల‌ర్ల స్కామ్‌లో అమెరికా కోర్టు ఆయ‌న‌కు ఈ శిక్ష‌ను ఖరారు చేసింది. ప్రాప‌ర్టీ టైకూన్‌గా పేరున్న గువో వెంగుయి 2017లో చైనాను వీడి అమెరికా వెళ్లారు. అక్క‌డ క‌మ్యూనిస్టు పార్టీ విమ‌ర్శ‌కుడిగా పేరుగాంచారు. 

ఆన్‌లైన్‌లో భారీ సంఖ్య‌లో చైనీయులు ఆయ‌న్ను ఫాలో అయ్యేవారు. అయితే మ‌నీల్యాండ‌రింగ్‌, ఫ్రాడ్‌, ముఠా నేరాభియోగాల కింద గువోను అరెస్టు చేశారు. చైనాకు ప్ర‌జాస్వామ్యాన్ని మార్చాల‌నుకున్న‌ ప్ర‌జ‌లను గువో పీక్కుతిన్నార‌ని న్యూయార్క్ కోర్టు జ‌డ్జీ అనాలిసా త‌న తీర్పులో పేర్కొన్నారు.  చైనీయుల నుంచి ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బును దోచుకున్నగువో ఆ సొమ్ముతో సంప‌న్న జీవితాన్ని గ‌డిపారు.

చైనాలో రాజ‌కీయ నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని భారీ ఆన్‌లైన్ ఉద్య‌మాన్ని న‌డిపారు.  అమెరికా చేరుకున్న త‌ర్వాత వారి నుంచి భారీ మొత్తంలో సొమ్మును రాబ‌ట్టారు. అమెరికాలో ఉన్న చైనా క‌మ్యూనిటీ ప్ర‌జ‌ల్ని న‌మ్మించారు.  త‌న ఫాలోవ‌ర్ల నుంచి సుమారు బిలియ‌న్ డాల‌ర్ల మొత్తాన్ని సేక‌రించారు. 2018 నుంచి 2023 మ‌ధ్య కాలంలో ఇన్వెస్ట్‌మెంట్‌, క్రిప్టో స్కీమ్‌ల‌తో ప్ర‌జ‌ల్ని గువో మోసం చేశారు.

అమెరికాలో గువో 50 వేల చ‌ద‌ర‌పు గ‌జాల ఇంటిని నిర్మించుకున్నారు. మిలియ‌న్ డాల‌ర్ల‌తో విలాస‌వంత‌మైన లాంబోర్గిని కారు ఖ‌రీదు చేశారు.  సుమారు 37 మిలియ‌న్ల డాల‌ర్లు పెట్టి ఓ నౌక‌ను సొంతం చేసుకున్నారు. స్వంత అవ‌స‌రాల కోసం డ‌బ్బును వాడ‌డంతో గువోపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  కానీ త‌న‌కు వ‌చ్చిన నిధుల‌ను రాజ‌కీయాల కోసం వాడిన‌ట్లు ఆయ‌న చెబుతున్నారు. చైనాను విమ‌ర్శించే అమెరికా నేత‌లతో గువో చేతులు క‌లిపారు. 

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కు గ‌తంలో స‌లహాదారుడిగా చేసిన స్టీవ్ బాన‌న్‌తో క‌లిసి ఆన్‌లైన్ వీడియోలు చేశారు. చైనా క‌మ్యూనిస్టు పార్టీకి వ్య‌తిరేకంగా ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేశారు.  ఓ ఫ్రాడ్ కేసులో గ‌త ఏడాది స్టీవ్ బాన‌న్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.  మ‌న్‌హ‌ట‌న్ కోర్టులో బాన‌న్ త‌న నేరాన్ని అంగీక‌రించారు. గువోపై మొత్తం 12 కేసులు నమోదు చేశారు. సుమారు ఏడు వారాల పాటు ప్రాసిక్యూట‌ర్లు ఆ కేసుల‌ను విచారించారు. బోగ‌స్ మాట‌ల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేసిన‌ట్లు న్యాయ‌మూర్తులు తేల్చారు.

ఫెడరల్ న్యాయమూర్తి చెప్పిన ప్రకారం, ఈ భారీ ఆర్థిక మోసం ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ప్రజలకు వందల మిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగించింది. అతనికి శిక్ష విధిస్తూ, బాధితుల నుండి తనకు అందిన లేఖల నుండి కొన్ని భాగాలను ఆమె చదివి వినిపించారు. న్యాయమూర్తి గ్వోను $889 మిలియన్ల పరిహారాన్ని జప్తు చేయాలని ఆదేశించారు.