పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను ఎత్తేసిన కేంద్రం

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను ఎత్తేసిన కేంద్రం
పశ్చిమాసియాలో సంఘర్షణ కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులకు ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానిక ఇంధన కొరతను నివారించడానికి జూన్ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేయాలన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సోమవారం జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొంది. 
 
పెట్రోలియం ఉత్పత్తుల ప్రస్తుత సరఫరా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఈ ఆంక్షలు ‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇకపై అవసరం లేదని’ నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఆంక్షల వల్ల పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు రిటెయిల్ బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఉండేది. బదులుగా, వారంతా కేవలం గుర్తింపు పొందిన బల్క్ సరఫరాదారుల నుంచి మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది.
 
జూన్ 12న ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ) ఉత్తర్వు, 2026’ కింద ఈ తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు నిర్వహించే రిటైల్ బంకుల ద్వారా పెట్రోల్, డీజిల్ విక్రయాలను, పంపిణీని క్రమబద్ధీకరించడానికే ఈ ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వం ప్రకారం ‘మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్ సరఫరాలను కొనసాగించడానికి, వాటి సమాన పంపిణీ, సరసమైన ధరలకు లభ్యతను నిర్ధారించడానికి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆంక్షలు అవసరమైనవి, సముచితమైనవిగా పరిగణించారు. అయితే, దేశీయ ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ‘‘సదరు ఉత్తర్వులోని ఆదేశాలను కొనసాగించడం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇకపై అవసరం లేదని కేంద్రం సంతృప్తి చెందింది’’ అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఇంధన రిటైలర్లు.. పెట్రోల్ బంకుల నుంచి జరిగే బల్క్ కొనుగోళ్లను గరిష్ఠంగా 90 రోజుల పాటు నియంత్రించాలని కూడా జూన్ 12 నాటి ఉత్తర్వుల్లో కేంద్రం ఆదేశించింది. ‘ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఆ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ పెట్రోలియం సరఫరా గొలుసు, షిప్పింగ్ లాజిస్టిక్స్, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతకు తీవ్ర అంతరాయం కలిగింది’ అని తెలిపింది.

ధరలలో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా బల్క్ వినియోగదారులు తమ కొనుగోళ్లను రిటైల్ పెట్రోల్ బంకులకు మార్చడంతో.. ముఖ్యంగా డీజిల్‌కు అసాధారణమైన డిమాండ్ పెరిగింది అని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.