బ్యారెల్ ముడి చ‌మురు 70 డాల‌ర్ల దిగువ‌కు

బ్యారెల్ ముడి చ‌మురు 70 డాల‌ర్ల దిగువ‌కు

పశ్చిమాసియాలో సంక్షోభం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ తగ్గుదల ప్రయోజనం దేశంలోని వినియోగదారులకు వెంటనే అందే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో ఎదుర్కొన్న భారీ నష్టాలను చమురు మార్కెటింగ్ కంపెనీలు పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 

అదేవిధంగా వినియోగదారులను ఆదుకునేందుకు భరించిన ఆర్థిక వ్యయంలో కొంత భాగాన్ని కేంద్ర ప్ర‌భుత్వం రాబట్టుకోవాలని భావిస్తోంది. ఈ కార‌ణాల‌చేత ముడి చ‌మురు త‌గ్గినా ఇప్ప‌ట్లో పెట్రోల్‌, డీజిల్ రేట్లు త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. సోమవారం నాటికి భారత క్రూడ్ ఆయిల్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు 68.86 డాలర్లకు తగ్గింది. 
 
పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న ఘర్షణలు మొదలైన తర్వాత మార్చి 23న గరిష్ఠంగా 157.04 డాలర్లకు చేరిన ధరతో పోలిస్తే ఇది 56 శాతం కంటే ఎక్కువ తగ్గుదల.  ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5 నుంచి రూ.6 వరకు లాభం పొందుతున్నప్పటికీ, డీజిల్ అమ్మకాలపై మాత్రం లీటర్‌కు రూ.8 నుంచి రూ.10 వరకు నష్టపోతూనే ఉన్నాయి. 
 
ఈ అంశంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం స్పందించలేదు.సంక్షోభ సమయంలో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడంవల్ల చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.26, డీజిల్‌పై రూ.81.90 నష్టం వచ్చింది.  దాంతో మార్చి 27న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గించింది.
అయినప్పటికీ నష్టాలు కొనసాగడంతో మే 15 నుంచి మే 25 మధ్య చమురు కంపెనీలు పెట్రోల్‌పై రూ.7.35, డీజిల్‌పై రూ.7.53 చొప్పున ధరలను పెంచాయి. జూన్ మధ్యలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు, సంక్షోభాన్ని ముగించే దిశగా అవగాహన ఒప్పందం కుదరడంతో చమురు ధరలు శాంతించడం ప్రారంభించాయి. కీలకమైన హ‌ర్మూజ్ జలసంధి నుంచి రవాణా పునఃప్రారంభం కావడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. 

ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల నెలకు రూ.14,000 కోట్లతో సహా, వినియోగదారులను ఆదుకోవడానికి కేంద్రంపై సుమారు రూ.1.23 లక్షల కోట్ల ఆర్థిక భారం పడిందని ప్రభుత్వ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ దేశాల నుంచి ముడిచమురును సమీకరించడం, మౌలిక సదుపాయాలను విస్తరించడంవల్లే ఇంధన కొరత లేకుండా సంక్షోభాన్ని తట్టుకోగలిగామని పురి తెలిపారు.