భారత్-పాకిస్థాన్ సంబంధాలపై విదేశాల్లో జరిగే చర్చల్లో రిటైర్డ్ దౌత్యవేత్తలు, సైనిక అధికారులు తమ వ్యక్తిగత హోదాలో పాల్గొనడంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అటువంటి చర్చలను భారత్ పరిగణనలోకి కూడా తీసుకోదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. గత వారం కొలంబోలో జరిగిన ప్రాంతీయ భద్రతా సదస్సు సందర్భంగా, భారత్, పాకిస్థాన్‌లకు చెందిన రిటైర్డ్ సైనిక అధికారులు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులతో కూడిన నిపుణులు ‘ట్రాక్-2’ (అనధికారిక) చర్చల్లో పాల్గొన్నారన్న వార్తల నేపథ్యంలో సీషెల్స్‌లోని విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ మిస్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వివిధ అంశాలపై ఇలాంటి కార్యక్రమాలు డజన్ల కొద్దీ జరుగుతుంటాయి. వీటిలో కొత్తదనం గానీ, ప్రత్యేకత గానీ ఏమీ లేదు,” అని విదేశాంగ కార్యదర్శి చెప్పారు. “మా వరకు చూస్తే, ఇవి ప్రైవేట్ వర్గాలు నిర్వహించే ప్రైవేట్ కార్యక్రమాలు మాత్రమే. వీటిలో అధికారికత ఏమీ లేదు.” అని తెలిపారు.
“పాకిస్థాన్ ప్రభుత్వం తరపున నేను మాట్లాడలేను, కానీ భారత ప్రభుత్వం విషయానికొస్తే, ఈ పర్యటనలలో ఎటువంటి అధికారిక భాగస్వామ్యం, మద్దతు లేదా ప్రమేయం లేదు.”కాబట్టి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భారతీయులు—వారు రిటైర్డ్ దౌత్యవేత్తలు కావచ్చు, రిటైర్డ్ సైనిక అధికారులు కావచ్చు లేదా పౌర సమాజ సభ్యులు కావచ్చు—ఎవరైనా సరే, వారు తమ సొంత అభిప్రాయాలనే వ్యక్తం చేస్తారని స్పష్టంగా అర్థం చేసుకోవాలి,” అని మిస్రీ సూచించారు.
భారతదేశం ఈ కార్యక్రమాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోదని విదేశాంగ కార్యదర్శి పేర్కొన్నారు. “వారు ఏ విధంగానూ భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించరు, ప్రతిబింబించలేరు కూడా. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఇదే,” అని ఆయన చెప్పారు. “మేము నిజంగా ఈ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోము. మా వరకు చూస్తే వీటికి పెద్దగా విలువ లేదు,” అని మిస్రీ జోడించారు.

More Stories
32 ఏళ్ల తర్వాత యమునా జలాల ఒప్పందం
చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు స్థిరం, సున్నితం
మత గ్రంథాల అపవిత్రీకరణ నిరోధక చట్టాన్ని నెలలో సవరించండి