భారతీయ దృక్పథంలోనే నేటి ప్రపంచం అన్వేషిస్తున్న సమాధానాలు 

భారతీయ దృక్పథంలోనే నేటి ప్రపంచం అన్వేషిస్తున్న సమాధానాలు 
నేటి ప్రపంచం అన్వేషిస్తున్న సమాధానాలు భారతదేశపు సంపూర్ణ, ఏకీకృత దృక్పథంలోనే ఉన్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ధృవీకరించారు.  భారతీయ శిక్షణ మండల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన “ఎన్‌ఈపీ 2020ని ఆచరణలోకి తీసుకురావడం: భారతీయ జ్ఞాన వ్యవస్థలను ఏకీకృతం చేయడం” అనే మూడు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ   ప్రస్తుతం ఉన్న ప్రపంచ చట్రాలు పాక్షిక దృక్కోణాలను మాత్రమే అందిస్తున్నప్పటికీ, అవి మాత్రమే మన కాలపు సవాళ్లను పూర్తిగా పరిష్కరించలేవని స్పష్టం చేశారు.
 
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల జీవుల సంక్షేమం కోసం, మన సంపూర్ణ దృక్పథం ఆధారంగా దీనిని పరిపూర్ణం చేయడానికి, భారత్ వాణి వినిపించాలి. ఇది అనివార్యం,” అని ఆయన ప్రకటించారు. భారతీయ శిక్షణ మండలి పనిని ఒక బృహత్ నాగరికతా ఉద్యమంలో భాగస్వామ్యంగా అభివర్ణిస్తూ, “ప్రపంచానికి పరిపూర్ణతను ఇవ్వడమే వాస్తవానికి మన పని” అని ఆయన చెప్పారు. 
 
భారతీయ దృక్పథాలను వివరిస్తూ, మోహన్ భగవత్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు: అది ఇతర దృక్పథాలను తప్పుగా పరిగణించదు, ఎందుకంటే ప్రజలందరూ తమ సొంత జీవితానుభవాల నుండి తమ దృక్పథాలను ఏర్పరచుకుంటారు. వాటికే వాటి ప్రామాణికత ఉంటుంది. అనేకత సూత్రం ద్వారా, వైవిధ్యాన్ని స్వీకరించే భారతీయ దృక్పథం అటువంటి అన్ని అనుభవాలను స్వాగతిస్తుంది.
 
సత్యం అనేది ఏ ఒక్క దృక్పథంలోనూ పూర్తిగా ఇమడలేనంత విశాలమైనదని, ప్రతి దృక్కోణం నుండి సారాన్ని గ్రహించడానికి మార్గం వాదన కాదని, శాస్త్రథం, అంటే పాండిత్య సంభాషణ అని అది గుర్తిస్తుందని ఆయన చెప్పారు. ఇతరులు అసంపూర్ణంగా మిగిలిపోయిన చోట భారతీయ దృక్పథాలు పరిపూర్ణంగా ఉంటాయిని పేర్కొంటూ ఈ పరిపూర్ణత కోసం, భారత్ వాణి వినిపించాలని ఆయన సూచించారు. 
 
భారతీయ శిక్షణ మండలి (బిఎస్ఎం) చేసే పని ఒక చిన్న లేదా పరిమితమైన సంస్థ కాదని, విద్య పట్ల సమగ్రమైన, ఏకీకృత భారతీయ దృక్పథంలో పాతుకుపోయిన ఒక పెద్ద నాగరికతా ఉద్యమంలో భాగస్వామ్యమని ఆయన నొక్కి చెప్పారు. కేవలం భౌతిక జీవనోపాధికి, ప్రతిదాన్నీ డబ్బుతో కొలవడానికి అతీతంగా, మానవుడిని సంపూర్ణంగా పరిగణించే సమగ్ర దృక్పథంతో బిఎస్ఎం పనిచేస్తుందని తెలిపారు. 
 
స్వాతంత్ర్య ఉద్యమ దిగ్గజాలు సైతం ఇటువంటి పనులను రాజకీయ సంస్థలకు దూరంగా ఎలా ఉంచారో గుర్తుచేస్తూ, “రాజకీయ పార్టీతో కలిసి ఇటువంటి పనిని సరిగ్గా చేయలేము” అని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు, వాటి ఒత్తిళ్లకు అతీతంగా స్వతంత్రంగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. లక్ష్య సాధనలో స్వాతంత్ర్యం, భారతీయ విలువలలో పాతుకుపోవడం, విశ్వ పూర్ణాత దృక్పథమే భారతీయ శిక్షణ మండలిని ఇతర సంస్థలన్నింటి నుంచి ప్రత్యేకంగా నిలుపుతున్నాయని చెప్పారు. 
 
ఈ సందర్భంగా, డాక్టర్ మోహన్ భగవత్ జీ భారతీయ శిక్షణ మండలి కొత్త వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఇది బిఎస్ఎం డిజిటల్ విస్తరణను పెంచడంలో, భారతీయ విద్య పట్ల దాని దృక్పథాన్ని దేశవ్యాప్తంగా, వెలుపల ఉన్న విద్యావేత్తలు, పండితులు, పౌరులకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు. 
 
బిఎస్ఎం  అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద్ జోషి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భరత్‌శరణ్ సింగ్‌లతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, విద్యాసంస్థల ప్రతినిధులు, పండితులు,  సభ్యులతో కూడిన 380 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన భారతీయ శిక్షణ మండలి సదస్సును కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. 
 
భారతీయ విలువలు, నైతిక విలువలతో కూడిన విద్యా రంగంలో భారతీయ శిక్షణ మండలి కార్యకలాపాలను బలోపేతం చేయడంపై భారతదేశం నలుమూలల నుండి వచ్చిన అధికారులు తమ ఆలోచనలను పంచుకోవడానికి, సమిష్టిగా చర్చించడానికి ఈ సమావేశం ఒక కీలకమైన వేదికను అందించింది.