అమెరికా, ఇజ్రాయెల్‌లపై అంతర్జాతీయ కోర్టులను ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్‌లపై అంతర్జాతీయ కోర్టులను ఇరాన్

ఇరాన్‌పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ దేశంలోని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు, ఇరాన్ ప్రముఖ నేతల వరకు ఎందరో పౌరుల మరణాలకు, వారిపై జరిగిన నేరాలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని మండిపడ్డారు.

వీరి మరణాలకు బాధ్యులను చేస్తూ వేలాది కేసులు దాఖలు చేయబోతున్నట్లు ఖమేని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. సాధారణ ప్రజల నుంచి దేశ అగ్రనాయకత్వం వరకు ఈ దాడుల్లో మరణించిన వారిని అమరులుగా అభివర్ణించారు.  ఈ అంశంపై అమెరికా-జియోనిస్టులు (యూఎస్, ఇజ్రాయెల్ నేతలు) చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు తమకు ఆధారాలుగా ఉపయోగపడతాయని ఖమేని పేర్కొన్నారు. 

దీనివల్ల అంతర్జాతీయ కోర్టులలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ కోర్టులలో పోరాడుతుందని తెలిపారు.  ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంటే, బదులుగా ఇరాన్‌పై అమెరికా వైమానిక దళం దాడులు చేస్తోంది. 

ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే, శాంతి ఒప్పందం కోసం తీసుకుంటున్న చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా హెచ్చరిస్తోంది. అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. మరో నెల రోజులపాటు ఈ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇతర ఏ దేశానికి అధికారం ఇవ్వబోమని తెలిపారు.