బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ రెండు రోజుల చైనా పర్యటన సందర్భంగా చైనా – బంగ్లాదేశ్ సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు తమ సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంటూ తీసుకున్న నిర్ణయాలు భారత్ కు భద్రతా పరమైన సమస్యలు సృష్టించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. తారిఖ్ రహ్మాన్ ప్రధానిగా మొదటి అధికార విదేశీ పర్యటన ఇదే కావడంతో ఆయన చైనాతో సంబంధాలకు ఇస్తున్న ప్రాధాన్యత వెల్లడిస్తుంది.
ముఖ్యంగా, ఇరు దేశాల ఒప్పందాల్లో కీలకంగా మారిన మోంగ్లా పోర్టు ఆధునీకరణ విస్తరణ ప్రాజెక్టుతో పాటు చిట్టగాంగ్‌లోని చైనా ఎకనామిక్ అండ్ ఇండస్ట్రీయల్ జోన్ అభివృద్ధిని కూడా ఇరు దేశాలు కలిసి చేపట్టాలని నిర్ణయించడం భారత్ కు రక్షణపరంగా ఆందోళన కలిగిస్తుంది. చిట్టగాంగ్ తర్వాత బంగ్లాదేశ్‌లో రెండవ అతిపెద్ద, రెండవ అత్యంత రద్దీగా ఉండే సముద్ర ఓడరేవు అయిన మోంగ్లా, కోల్‌కతాకు కేవలం 188 కిలోమీటర్ల దూరంలోనూ, సుందర్బన్స్కు సమీపంలోనూ ఉంది.
గతంలో మోంగ్లా పోర్టు టెర్మినల్ నిర్వహణ హక్కులను భారత్ పొందింది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తగ్గించే వ్యూహాత్మక విజయంగా అప్పట్లో భావించారు. అయితే, తాజా ఒప్పందంతో ఈ ప్రాజెక్టులో చైనా ప్రవేశించడం ఇప్పుడు భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకు కూడా చైనా మద్దతు ప్రకటించింది. నీటి వనరుల నిర్వహణ, వరదల నివారణ, హైడ్రాలజీ, నదుల డ్రెడ్డింగ్ వంటి రంగాల్లో బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేస్తామని చైనా ప్రకటించింది.
ఈ ప్రాజెక్ట్ భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఉండటంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో భారత మాజీ హైకమిషన్ వీణా సిక్రీ మాట్లాడుతూ 2024లో మాజీ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా మోంగ్లా పోర్టు, తీస్తా నీటి నిర్వహణ ప్రాజెక్టులు భారత్‌కు అప్పగించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాని తారిఖ్ రహ్మాన్ ఆ ప్రాజెక్టులను చైనాకు అప్పగించడం నిరాశ కలిగించే విషయమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
యూనస్ పాలనలో ఇటీవలి దౌత్యపరమైన ఘర్షణలు ఉన్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగాలలో భారత్-బంగ్లాదేశ్ భాగస్వామ్యాలు బలంగా కొనసాగుతున్నాయి. ఈ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఢాకా, బీజింగ్ మధ్య ఉన్న ప్రణాళికలను కూడా ఈ సంయుక్త ప్రకటన వివరిస్తుంది. ఇరుపక్షాలకు అనుకూలమైన సమయంలో బంగ్లాదేశ్‌ను సందర్శించాల్సిందిగా రెహమాన్ చైనా నాయకత్వాన్ని ఆహ్వానించారని పేర్కొంటూ ఈ ప్రకటన ముగుస్తుంది.

More Stories
హర్మూజ్‌లో మరో చమురు ట్యాంకర్‌పై దాడి
అఫ్గనిస్థాన్, జపాన్ లలో భారీ భూకంపాలు
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గాం దాడి సూత్రధారి