దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలా, జపాన్ లను భారీ భూకంపాలు వణికించాయి. వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని కారకాస్‌లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. ప్రాణభయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది.
భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్‌లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. కొన్ని సెకన్ల పాటు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జాతీయ భూకంప పరిశోధనా సంస్థల సమాచారం ప్రకారం భూకంప కేంద్రం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో, భూమికి సుమారు 64 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప ప్రకంపనలు జపాన్ ఉత్తర ప్రాంతాలతో పాటు రాజధాని టోక్యోలోనూ స్వల్పంగా అనుభూతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
వెనెజువెలా లో భారీ ఆస్తి నష్టం సంభవించడంతోపాటు కరీబియన్ తీర ప్రాంత దేశాలు సునామీ భయంతో వణికిపోతున్నాయి. ఈ భూకంపాల కారణంగా భారీగా ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉంది. యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం మొదట కారకాస్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలోని మొరోన్ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, సరిగ్గా దాని తర్వాతి నిమిషంలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం కుదిపేసింది.
భూ అంతర్భాగంలో కేవలం 1 0 నుంచి 13 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావడంవల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గడిచిన శతాబ్ద కాలంలో వెనిజువెలా ఎదుర్కొన్న అత్యంత బలమైన భూకంపాలలో ఇది ఒకటని చెబుతున్నారు. భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.
కారకాస్‌లోని ప్రముఖ అల్టామిరా పరిసర ప్రాంతాల్లో, తీర ప్రాంత నగరమైన లా గుఐరాలో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, గృహాలు కుప్పకూలాయి. ప్రమాద స్థలాల నుంచి భారీగా ధూళి మేఘాలు గాల్లోకి లేచాయి. విద్యుత్, ఇంటర్నెట్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ప్రభుత్వ టెలివిజన్ ద్వారా మాట్లాడుతూ అల్టామిరా ప్రాంతంలో భవనాలు, ఇళ్లు కూలిపోయిన అత్యంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులతో సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు. భూకంపాల నేపథ్యంలో, తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.
More Stories
భారత్- దక్షిణ కొరియా సహకారం బలోపేతం చేసుకోవాలి
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
ఇరాన్ యుద్ధం ఆపాలంటూ అమెరికా సెనేట్ తీర్మానం