బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. కొంతకాలంగా పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, అధికార లేబర్ పార్టీలో వత్యిరేకతతో పదవి నుంచి తప్పుకోవాలని స్టార్మర్ నిర్ణయించుకున్నారు. దీంతో అధికార లేబర్ పార్టీలో నెలకున్న విబేధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. యూకే ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘‘తన నిర్ణయం గురించి రాజుకు తెలియజేశాను. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతాను’’ స్టార్మర్ తెలిపారు.
10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల స్టార్మర్ మాట్లాడుతూ తన నాయకత్వంపై వ్యతిరేకత, పార్టీలో తలెత్తిన అంతర్గత విబేధాలను అంగీకరించారు. ‘‘లేబర్ పార్టీ ని ముందుకు నడిపించడానికి ఎవరు అత్యంత సమర్థులు అనేదే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నఅని నాకు తెలుసు. రాబోయే ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించడానికి నేను సరైన స్థానంలో ఉన్నానా లేదా అని పార్టీ అడుగుతోంది. నా పార్టీ సహచరుల నుంచి నేను ఆ సమాధానం విన్నాను, దానిని నేను అంగీకరిస్తున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం నేను ప్రేమించే దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికే. అందుకే నేను లేబర్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేస్తున్నాను.’’అని ప్రకటించారు.
‘‘నా నిర్ణయం గురించి రాజుకు తెలియజేశాను.. సెప్టెంబరులో జరిగే తదుపరి పార్లమెంట్ సమావేశానికి ముందే కొత్త నేత బాధ్యతలు స్వీకరించేలా ప్రక్రియను ప్రారంభించమని పార్టీ జాతీయ కార్యవర్గాన్ని కోరతాను. లేబర్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి దోహదపడేలా, మరింత బలమైన బ్రిటన్‌ను నా వారసుడు వారసత్వంగా పొందుతాడని నాకు తెలుసు. అందుకు పూర్తి మద్దతు ఇస్తాను. నాకు మద్దతు ఇచ్చిన నా సహచరులందరికీ ధన్యవాదాలు’’ అని ఆయన తెలిపారు.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కావడం తన జీవితంలోనే “అత్యంత గర్వించదగ్గ క్షణం” అని ఆయన పేర్కొన్నారు. తన ప్రసంగం చివరలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు; ఇకపై తన కుటుంబ జీవితంపై ఎక్కువ దృష్టి సారిస్తానని, తనకు సాధ్యమైనంత ఉత్తమమైన భర్తగా మరియు తండ్రిగా ఉంటానని చెప్పారు. వరుస రాజకీయ ఎదురుదెబ్బలు, తగ్గుతున్న ప్రజా మద్దతు, లేబర్ పార్టీలో నాయకత్వ మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో స్టార్మర్ భవిష్యత్తుపై సాగుతున్న ఊహాగానాల నడుమ ఆయన నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది.
2024 ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం దిశగా నడిపించిన స్టార్మర్ 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు ముగింపు పలికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రభుత్వానికి మొదట్లో భారీ ప్రజా మద్దతు లభించినప్పటికీ, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలు, పార్టీ అంతర్గత విభేదాల విషయంలో సవాళ్లను ఎదుర్కొంది. గత వారం జరిగిన ఒక ప్రత్యేక ఎన్నికలో ఆండీ బర్న్‌హామ్ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన బర్న్‌హామ్, ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన నాయకుడు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల కోసం స్టార్మర్‌తో పోటీ పడేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. స్టార్మర్ వారసుడిగా ఆండీ బర్న్‌హామ్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. లేబర్ పార్టీలో బర్నహామ్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరుకుందని ది గార్డియన్ నివేదించింది.
స్టార్మర్ రాజీనామాకు ప్రధాన కారణం తన సొంత పార్టీలోనే పార్లమెంటరీ మద్దతు కోల్పోవడం. లేబర్ పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు తమ మద్దతును ఆండీ బర్న్‌హామ్‌కు మార్చగా, క్యాబినెట్‌లో పెరుగుతున్న అసమ్మతి అస్థిరతను మరింత తీవ్రతరం చేసి, చివరికి ఆయన రాజీనామాకు దోహదపడింది. విధానపరమైన దిశ, ఆర్థిక పనితీరు, ప్రజామోదం రేటింగ్‌లు, ప్రధాన జాతీయ నిర్ణయాలపై ప్రతిస్పందనల విషయంలో ఉన్న విభేదాలు ఇతర కారణాలుగా ఉన్నాయి.
పన్ను విధానం, సంక్షేమ నిర్ణయాలు, పీటర్ మాండెల్సన్ నియామకంతో సహా ఉన్నత స్థాయి నియామకాలపై కూడా ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇక, జులై 2024లో కీర్ స్టార్మర్ యూకే ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ 58వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మార్పు తీసుకువస్తానని స్టార్మర్ వాగ్దానం చేశారు. తన మొదటి ప్రసంగంలో మాజీ ప్రధాని రిషి సునక్ అంకితభావం, కృషిని కొనియాడారు. లేబర్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గతుండగా, నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీకి భారీగా ఆదరణ పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

More Stories
ఇరాన్ ఒప్పందం కోసం 60 రోజుల రోడ్‌మ్యాప్ ఖరారు
ఖతార్ గ్యాస్ కేంద్రంలో భారీ పేలుడు .. 18 మంది గల్లంతు
వివాహ వ్యవస్థలకు అనువుగా కుటుంబ చట్టాల సమీక్ష