‘మెగా ఫుడ్ పార్క్’ ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరపాలి  

‘మెగా ఫుడ్ పార్క్’ ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరపాలి  
అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెగా ఫుడ్ పార్క్’ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తమ అనుయాయులకు, ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు కేంద్రంగా మార్చేసిందని  బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
ఈ ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న పారదర్శకత లేని చీకటి ఒప్పందాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఓ లేఖ వ్రాసిన్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ  లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్  ద్వారా సమగ్ర విచారణ జరిపించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
 
రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను చేకూర్చడం, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ వ్యవస్థలతో కూడిన ప్రపంచ స్థాయి వ్యవసాయ మౌలిక సదుపాయాలను నిర్మించాలనే సమున్నత లక్ష్యంతో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. 
 
ఇందుకోసం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016 ఫిబ్రవరి 5న ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలిపిందని, సుమారు రూ. 109.59 కోట్ల భారీ అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం, కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 49.79 కోట్ల నిధులను గ్రాంట్ రూపంలో విడుదల చేసిందని చెప్పారు. స్థానిక రైతుల నుంచి సుమారు 200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందని, అయితే, ఆ రైతుల త్యాగాల పునాదుల మీద నిర్మితమవుతున్న ఈ ఫుడ్ పార్క్ భూములపై ఇప్పుడు బడా బాబుల కన్ను పడిందని ఆరోపించారు.
 
ఏకంగా 72 ఎకరాల విస్తీర్ణమైన విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా “దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్” అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు తెరవెనుక పక్కా స్కెచ్ వేసిందని వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు పలుకుతుండగా, కేవలం 21 లక్షల రూపాయల అతి తక్కువ ధరకే ఆ ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 
 
బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌లో భూ కేటాయింపుల బాగోతం, సింగరేణి బొగ్గు మాయం వ్యవహారాలపై వాస్తవాలను వివరిస్తూ తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉందా అని డాక్టర్ సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు.