* మూడో ఏడాదీ వడ్డీ యథాతథం 8.25 శాతం
ఈపీఎఫ్‌వో వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఏటీఎం విత్‌డ్రా సదుపాయాన్ని ఈ నెలాఖరు లోగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన వెలువడుతుందని ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సూచనప్రాయంగా వెల్లడించారు. ఈపీఎఫ్‌వో 3.0 కింద ఈ కొత్త విధానం అమలుకానుంది. ఈ సదుపాయం అమలులోకి వస్తే ఈపీఎఫ్ డబ్బును త్వరగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ పూర్తై, అనుమతి లభిస్తే నగదును త్వరగా యూపీఐ ద్వారా లేదా ఈపీఎఫ్‌వో ఎనేబుల్డ్ ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చు. కొత్త రూల్స్ ప్రకారం ఈపీఎఫ్ అకౌంట్లలోని 75 శాతం డబ్బును ఇలా తమ బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూపీఐ లేదా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ విధానాన్ని కేంద్రం అమలు చేయబోతుంది. ఓటీపీ ద్వారా ఇలా నగదు ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది. గతంలో ఈపీఎఫ్ నగదు జమ చేసుకునేందుకు చాలా సమయం పట్టేది. కొన్నిసార్లు రెండు, మూడు వారాలు కూడా పట్టేది. కానీ, ఇప్పుడు త్వరగా, ఏటీఎం లేదా యూపీఐ ద్వారా నగదును ఉపసంహరించుకోవచ్చు.
ఈపీఎఫ్‌వో ప్రకారం ఒక ఉద్యోగి పెన్షన్ పొందాలంటే కనీసం పదేళ్లపాటు పని చేసి ఉండాలి. అంటే పీఎఫ్ అకౌంట్ పదేళ్లపాటు నిర్వహణలో ఉంటే వారికి రిటైర్‌మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. ఈ నెలాఖరులోగా 7 కోట్లకు పైగా చందాదారుల ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది మార్చి 2న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశం 2025-26 సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. ఈపీఎఫ్ వడ్డీ రేటు మారకుండా కొనసాగడం ఇది వరుసగా మూడవ సంవత్సరం. ఈపీఎఫ్‌వో అభివృద్ధి చేసిన కొత్త డిజిటల్ వ్యవస్థలో సంబంధిత ప్రక్రియ ప్రారంభమైన వెంటనే చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది.

More Stories
బ్రహ్మోస్ క్షీపణుల కొనుగోలు పట్ల రష్యా ఆసక్తి?
సైబర్ నేరాలకు వేదికగా మారిన టెలిగ్రామ్
ముడి చమురు ధరలు తగ్గినా ఇంధన ధరలను తగ్గించలేం