బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను రష్యా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా తన సైనిక దళాల్లోకి ఈ అత్యాధునిక క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. బ్రహ్మోస్ క్షిపణిపై రష్యా ఆసక్తిని కనబరుస్తున్నదని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జైతీర్థ జోషి తెలిపారు. నాగపూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ సంస్థ 100వ స్వదేశీ బూస్టర్‌ను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రహ్మోస్ ప్రోగ్రామ్‌లో రష్యా భాగస్వామ్యమే అయినా, ఈ క్షిపణిని తమ సైనిక దళాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ దేశం ఆసక్తి ప్రదర్శిస్తుందని జోషి తెలిపారు.
ఈ విషయమై రష్యాతో చర్చలు జరుగుతున్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్రహ్మోస్‌ను రష్యా కోరుతున్నట్లు జోషి చెప్పారు. భవిష్యత్తులో రష్యాకు అవసరమయ్యే క్షిపణులను భారత్ నుంచి పంపిస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ రష్యా తయారీ సంస్థలకు భారతీయ పరిశ్రమలు ఊతం అందిస్తాయని తెలిపారు.
“రష్యా ప్రభుత్వం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందని తెలిసింది. కానీ రష్యాకు ఇప్పటికే స్థిరపడిన పారిశ్రామిక భాగస్వాములు ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా బ్రహ్మోస్ క్షిపణిని తమ సైన్యంలో భాగంగా చేసుకోవాలనుకుంటోంది. ఈ విషయంపై మేము రష్యాతో చర్చలు జరుపుతున్నాం” అని జయతీర్థ్ జోషి స్పష్టం చేశారు.
భవిష్యత్తులో రష్యాకు అవసరమైన క్షిపణులను భారత్ సరఫరా చేస్తుందా? అని ప్రశ్న అడగ్గా, రష్యాలో ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో భారత పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. భారత్‌కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్‌పీవో మషినోస్ట్రోయేనియా సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నాయి.
భారత రక్షణ రంగంలో ఇప్పుడు బ్రహ్మోస్ ఓ కీలక ఎగుమతి వస్తువుగా మారింది. బ్రహ్మోస్ క్షిపణికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందని, సుమారు 25 ఏళ్ల పాటు సాగిన అభివృద్ధి, టెస్టింగ్, ఆపరేషనల్ డెవలప్మెంట్ ఫలితమే బ్రహ్మోస్ అని జోషి పేర్కొన్నారు. సరిహద్దుల సంరక్షణకు, శత్రు దాడులను నిరోధించడానికి స్వీయ సాంకేతికతతో భారత్ అభివృద్ధి చేసుకున్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం, ఆత్మనిర్భరతకు నిలువెత్తు సాక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణి నిలుస్తోంది.
అధిక వేగం, దూరం, కచ్చితత్వం దీని ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. భూతల, గగనతల, సముద్రతలాల నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి కూడా దూసుకొచ్చి శత్రు దేశాల లక్ష్యాలను ధ్వంసం చేయడం బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ లైవ్ టెస్ట్ చేశామని, ఆ సక్సెస్ స్టోరీ ప్రపంచం అంతా చూసిందని గుర్తు చేశారు.

More Stories
ఈ నెలాఖరు లోగా ఈపీఎఫ్ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం
సైబర్ నేరాలకు వేదికగా మారిన టెలిగ్రామ్
ముడి చమురు ధరలు తగ్గినా ఇంధన ధరలను తగ్గించలేం