సైబర్ నేరాలకు వేదికగా మారిన టెలిగ్రామ్

సైబర్ నేరాలకు వేదికగా మారిన టెలిగ్రామ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ ప్రస్తుతం ఒక ‘కొత్త డార్క్ వెబ్’ గా మారిపోయిందని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైబర్ కేటుగాళ్లు, ఉగ్రవాద శక్తులు, లీకేజీ ముఠాలకు ఈ వేదిక ఒక సురక్షితమైన అడ్డాగా రూపాంతరం చెందిందని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. నీట్-యూజీ 2026  పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని గట్టిగా సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానంలో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది.
 
టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుదీర్ఘంగా వాదనలు విన్న జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్, ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. జూన్ 21న జరగబోయే నీట్ రీ-టెస్ట్‌ను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 
 
గత మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘నీట్ మాఫియా’ వంటి ప్రత్యేక టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా ప్రశ్నపత్రాలు మళ్లీ లీక్ కాకుండా నిరోధించేందుకు జూన్ 22 వరకు ఈ తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. టెలిగ్రామ్‌లో ఉన్న మితిమీరిన ప్రైవసీ ఫీచర్లే నేరగాళ్లకు వరంగా మారాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
తమ ఫోన్ నంబర్లు, వ్యక్తిగత గుర్తింపు బయటపడకుండా నేరస్థులు సులభంగా తప్పించుకుంటున్నారని పేర్కొంది. కేవలం పరీక్షల అక్రమాలే కాకుండా, ఈ యాప్ వేదికగా క్రింది దందా సాగుతోందని అఫిడవిట్‌లో ఆరోపించింది. ఒక టెలిగ్రామ్ ఖాతా ద్వారా ఏకంగా 40 బాట్లను సృష్టించే అవకాశం ఉందని, ఆ బాట్లు మరిన్ని బాట్లను తయారు చేసి పెద్ద ఎత్తున సమాచారాన్ని వ్యాప్తి చేయగలవని వివరించారు.
ఇతర సోషల్ మీడియా వేదికలతో పోలిస్తే టెలిగ్రామ్ నిర్మాణం భిన్నంగా ఉండటంతో నేరస్థులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కష్టమవుతోందని పేర్కొన్నారు.  టెలిగ్రామ్ క్లౌడ్ ఆధారిత వ్యవస్థపై పనిచేస్తుందని, ఒక అకౌంట్‌ను బ్లాక్ చేసినా మరో పేరుతో కొత్త ఖాతాలు సృష్టించడం సులభమని కేంద్రం తెలిపింది. ఈ కారణంగానే పరీక్షా పత్రాల లీక్‌లు, ఉగ్రవాద భావజాల ప్రచారం, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి కార్యకలాపాలకు ఇది ప్రధాన వేదికగా మారిందని ఆరోపించింది.

చైల్డ్ పోర్నోగ్రఫీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా. ఉగ్రవాద ప్రచారం, దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలు. సైబర్ దాడులు, పెద్ద ఎత్తున జరుగుతున్న ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు వేదికగా మారినట్లు ఆరోపించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. భారతదేశంలోని తమ 150 మిలియన్ల (15 కోట్లు) వినియోగదారుల భావప్రకటనా స్వేచ్ఛను ఈ నిషేధం హరిస్తోందని వాదించింది. 

కొద్దిమంది చేసే తప్పులకు యూజర్లందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని కోరింది. అయితే, ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం టెలిగ్రామ్ సంస్థకు ఎలాంటి తక్షణ ఊరట ఇవ్వడానికి నిరాకరించింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పవిత్రతను కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్రం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.