ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చెప్పిన అమెరికా ఈ ప్రాంతంలో పనిచేసే తమ సైనిక కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగించడమే కాకుండా భారత చిత్రపటాన్ని కూడా మార్చి చూపించింది. అయితే అమెరికా చర్య వివాదాస్పదమైంది. అమెరికాకు చెందిన చారిత్రక ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ పేరును మళ్లీ ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’ గా మార్చినట్లు అగ్రరాజ్య రక్షణశాఖ తాజాగా వెల్లడించింది.
‘చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్‌లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ కమాండ్‌కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించాం’ అని అమెరికా రక్షణశాఖ పేర్కొన్నది. ఇక ఈ కమాండ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుపుతూ తమ వెబ్సైట్లో ఓ ఫొటోను ఉంచింది. అందులో ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ ను పాకిస్థాన్ భూభాగంగా చూపించడం వివాదానికి దారితీసింది.
యూఎస్ పసిఫిక్ కమాండ్‌ను 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రుమ్యాన్ ఏర్పాటు చేశారు. అగ్రరాజ్య వెస్ట్‌కోస్ట్ నుంచి భారత పశ్చిమతీరం వరకు గత ఏడు దశాబ్దాలకుపైగా ఈ కమాండ్ సేవలందిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలకపాత్ర పోషించింది. కొరియన్, వియత్నాం యుద్ధాల్లోనూ పనిచేసింది.
ఎన్నో మానవతా ఆపరేషన్లను చేపట్టింది. అయితే ట్రంప్ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో 2018లో దీని పేరును ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని పేరులో ‘ఇండో’ అనే పదం చేర్చినట్లు నాటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ వెల్లడించారు.
అయితే ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్‌ను అగ్రరాజ్యం దూరం పెడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. . అయితే, ఈ పరిణామం భారత్‌ను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగించడం ద్వారా ఇండో-పసిఫిక్ వ్యూహం విషయం, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాతో కూడిన ‘క్వాడ్’ కూటమి పాత్రపై అగ్రరాజ్యం తన వైఖరిని మార్చుకుంటోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ క్వాడ్ కూటమి ముగిసినట్టేనా? అని ఆయన ప్రశ్నించారు. ‘క్వాడ్ కూటమి శవపేటికపై మరో మేకు కొట్టారు’ అంటూ అమెరికా వార్ డిపార్ట్మెంట్ ఆర్డర్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.
అమెరికా నిర్ణయంపై వివిధ ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ ఇది కేవలం పేరు మార్పునకు మాత్రమే పరిమితమని వైట్‌హౌస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కమాండ్ అంతర్గత నిర్మాణం, బాధ్యతలు, ప్రాంతీయ నిబద్ధతలలో ఎలాంటి మార్పులు ఉండబోవని నొక్కి చెప్పారు. యూఎస్ పసిఫిక్ కమాండ్ పరిధి అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంది.

More Stories
ఝార్ఖండ్‌లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
త్వరలో ఎస్పీలో భారీ చీలిక.. బీజేపీ వైపు ఆ పార్టీ నేతలు!
అయోధ్య రామమందిరం విరాళాలపై రాజకీయ దుమారం