టిఎంసి, శివసేన (యుబిటి)ల తర్వాత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఆ పార్టీ నేతలను పెద్ద సంఖ్యలో బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం అవుతుందా? ఆ పార్టీ నేతలు పలువురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటూ యూపీ పంచాయతీ రాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ సంచలన ప్రకటన చేశారు.
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో 33% మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న డీలిమిటేషన్ బిల్లును ఆమోదించడానికి, లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని పటిష్టం చేసుకునేందుకు ఎన్డీఏ కృషి చేస్తున్నందున, మహారాష్ట్ర, బెంగాల్‌ను పక్కనపెట్టి, మొత్తం ఎస్పీ బీజేపీలో చేరడానికి సిద్ధంగా కూర్చుందని ఆయన వెల్లడించారు.
“ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ ఒక జాబితాను తయారు చేసి హోంమంత్రి అమిత్ షాకు అందజేశారు. వారిద్దరి ముఖాల్లో చిరునవ్వులు నేను చూశాను. రెండు హృదయాలు కలిసినప్పుడు మాటలు నిశ్శబ్దం కావచ్చు, కానీ సంభాషణ జరుగుతుంది,” అని రాజ్‌భర్ తెలిపారు. “వారికి ఎలాంటి హాని జరగకూడదని, ఈ నాయకులు మీతో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ లేఖ తెలియజేస్తుంది,” అని ఆయన ఎవరి పేర్లనూ వెల్లడించకుండా లేదా ఈ నిర్ధారణకు ఎలా వచ్చారో వివరించకుండా చెప్పారు.
“మైనింగ్ స్కామ్, గోమతీ నదీ తీర అభివృద్ధి (గోమతీ రివర్ ఫ్రంట్) కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారి ఎవరో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. చట్టం ఉచ్చు బిగుసుకుంటుండటంతో ఎస్పీ ఆందోళన చెందుతోంది” అని హిందీలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన సోషల్ మీడియా పోస్ట్‌ను సమర్థించుకున్నారు.
మొత్తం సమాజ్‌వాదీ పార్టీ బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంది’ అని ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. ‘ఇది వంద శాతం నిజం. రాజ్‌భర్ ఏది చెప్పినా ధైర్యంగా, నిజాయితీగా చెబుతారు’ అని చెప్పుకొచ్చారు. తన వాదనకు సంబంధించిన వివరాలు అడిగినప్పుడు, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. ‘ఇప్పుడే పేరు బయటపెడితే, ఆ ప్రయత్నమంతా వృథా అవుతుంది. కొన్ని రోజులు వేచి ఉండండి’ అని మీడియాతో పేర్కొన్నారు.
2022 ఎన్నికల్లో రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో పొత్తు పెట్టుకున్నది. 19 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఆరు సీట్లలో గెలిచింది. అయితే ఫలితాలు వచ్చిన కొద్ది నెలలకే, 63 ఏళ్ల రాజ్‌భర్ ఎస్పీతో సంబంధాలు తెంచుకున్నారు. ఆ తర్వాత ఎన్డీఏలో తిరిగి చేరారు.
అయితే, తాను ఎటువంటి లేఖనూ సమర్పించలేదని స్పష్టం చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇలా తెలిపారు: “నేను ఏదైనా లేఖ సమర్పించానా లేదా అనేది మీరు అమిత్ షా జీని అడగాలి. దేశంలో ఎవరూ ఓం ప్రకాష్ రాజ్‌భర్‌ను సీరియస్‌గా తీసుకోరు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటారు. అసలు తానేం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు,” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
పార్టీలో అంతా సవ్యంగానే ఉందని, అవన్నీ కేవలం వదంతులేనని సమాజ్‌వాదీ పార్టీ నేత పేర్కొన్నారు. “ఎలాంటి సమస్య లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. వారు కేవలం వదంతులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారిని తిట్టుకుంటారు,” అని ఆయన జోడించారు. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా రాజ్‌భర్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. “ఈ వ్యవహారం ఇంకెంత కాలం కొనసాగుతుంది? మీకు అన్నం పెట్టేవారి భాషనే మీరు మాట్లాడతారు,” అని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు.

More Stories
భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం ఎగుమతులు
పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం
నిజ్జర్ హత్యకులారెన్స్ బిష్ణోయ్ ఆదేశం.. భారత్ ప్రమేయం లేదు!