పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)లో ఇటీవల జరిగిన అంతర్గత కలహాల నేపథ్యంలో, రాజకీయ దృష్టి ఇప్పుడు మహారాష్ట్ర వైపు మళ్లింది. అక్కడ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) ఒక పెద్ద తిరుగుబాటు ముప్పును ఎదుర్కొంటున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీకి చెందిన తొమ్మిది మంది లోక్సభ ఎంపీలలో ఏడుగురు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే ఆయన వర్గంలో చేరవచ్చని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, లోక్సభ స్పీకర్ను కలిసే ముందు శివసేన (యుబిటి)కు చెందిన పలువురు ఎంపీలు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఢిల్లీ నివాసంలో బుధవారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లాను కలవడానికి వెళ్తారని సమాచారం. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా పాల్గొంటారు. ఈ పరిణామాలకు ‘ఆపరేషన్ టైగర్’ అని మారుపేరు పెట్టినట్లు సమాచారం.
ఇది మహారాష్ట్రలో మారుతున్న అధికార సమీకరణాలను మరింతగా మార్చగల ఒక రాజకీయ ఎత్తుగడ. ఎంపీలే కాకుండా, పలువురు శివసేన (యుబిటి) శాసనసభ్యులు కూడా షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భావిస్తున్నారు. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు అధికార శివసేన వర్గంలో చేరే అవకాశాలను అన్వేషిస్తున్నారని, ఇది మరో పార్టీ వీడిపోయే ప్రమాదంపై ఉద్ధవ్ థాకరే వర్గంలో ఆందోళనలను పెంచుతోందని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి.
ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తూ, శివసేన సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి దీపక్ కేసర్కర్ ‘ఆపరేషన్ టైగర్’ను ప్రస్తావిస్తూ పరిపాలన పట్ల ఏక్నాథ్ షిండేకు ఉన్న అభివృద్ధి-ఆధారిత విధానం కారణంగా, పలువురు ఎన్నికైన ప్రతినిధులు ఆయనతో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
కేసర్కర్ ప్రకారం, పార్టీ మారాలని భావిస్తున్న నాయకులు శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నారని తెలిపారు. ఈ నాయకులు నేరుగా బీజేపలోకి వెళ్లకుండా, షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడానికి ఇష్టపడటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని ఆయన చెప్పారు.
ఇప్పుడు అందరి దృష్టి శివసేన ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 19పైనే ఉంది. ఈ కార్యక్రమానికి ముందు “భారీ రాజకీయ అలజడి” చోటుచేసుకోనుందని నాసిక్ యుబిటి ఎంపీ రాజాభావు వాజే సంకేతాలు ఇచ్చారు. ముంబైలోని షణ్ముఖానంద హాల్లో శివసేన 60వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరగనుండగా, అక్కడ ఉద్ధవ్ ఠాక్రే తన బలాన్ని ప్రదర్శించనున్నారు.
పార్టీ ఫిరాయింపులను నివారించే ప్రయత్నంలో ఉద్ధవ్ థాకరే, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఎంపీలను, పార్టీ నాయకులను సంప్రదిస్తున్నారని కూడా ఆ మాజీ మంత్రి పేర్కొన్నారు. అయితే, కేసర్కర్ ఆ ప్రయత్నాలను ప్రభావహీనమైనవిగా కొట్టిపారేశారు. “ఆపరేషన్ టైగర్” చుట్టూ అల్లుకున్న ఊహాగానాల మధ్య, ఉద్ధవ్ థాకరే తన పార్టీ ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు, థాకరే పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించగా, ఐదుగురు ఎంపీలు గైర్హాజరయ్యారు. అయితే, వారు ఆన్ లైన్ లో సమావేశంపై హాజరయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జూన్ 22న సాయంత్రం 4:00 గంటలకు ముంబైలోని పార్టీ కార్యాలయంలో శివసేనలోని తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరితో థాకరే సమావేశం ఏర్పాటు చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే, థాకరే తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులందరికీ మార్గదర్శనం చేసి, వివరాలు తెలియజేస్తారు. ఏడుగురు ఎంపీలు షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోపు వారంతా షిండే వర్గంలో చేరే అవకాశం ఉందని శివసేనకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే క్రిపాలు మానె వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే మౌనంవీడుతూ పార్టీని వీడాలనుకునే వారిని తాను బలవంతం చేయబోనని స్పష్టం చేశారు. శివసేనను వీడాలనుకునే వారు నిశ్చింతగా వెళ్లిపోవచ్చన్న, పార్టీలో ఉండమని ఎవరిపైనా ఒత్తిడి చేయొద్దని నిర్ణయించు కున్నానని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన చీలిక గురించి ప్రస్తావిస్తూ బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీని వీడిన వారు తమ నిర్ణయం పట్ల చివరికి పశ్చాత్తాపపడతారని, శివసేనను వీడాలని నిర్ణయించుకున్న వారు చివరికి చింతిస్తారని తెలిపారు.

More Stories
పరస్పర విశ్వాసమే నేడు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తి
రాహుల్ గాంధీ టార్గెట్ బీజేపీ కాదు, కూటమి లోని మిత్రపక్షాలే
హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు