నీట్ రీ-ఎగ్జామ్ నేప‌థ్యంలో టెలిగ్రాం యాప్‌ నిషేధం

నీట్ రీ-ఎగ్జామ్ నేప‌థ్యంలో టెలిగ్రాం యాప్‌ నిషేధం
నీట్ రీ-ఎగ్జామ్ నేప‌థ్యంలో టెలిగ్రాం యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. జూన్ 22వ తేదీ వ‌ర‌కు టెలిగ్రాం యాప్ అందుబాటులో ఉండ‌దు. జూన్ 21వ తేదీన దేశ‌వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక జూన్ 30వ తేదీ వ‌ర‌కు టెలిగ్రాం యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచ‌ర్‌ను కూడా ప్ర‌భుత్వం డిజైబుల్ చేసింది. 
 
ఎగ్జామ్ మెటీరియ‌ల్‌ను లీకేజీ చేయ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌ల‌కు చేప‌ట్టింది. మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన యాప్‌ను త‌క్ష‌ణ‌మే బ్లాక్ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ఆధారంగా ఈ చ‌ర్య చేప‌ట్టారు. కేవ‌లం ఎగ్జామినేష‌న్ పీరియ‌డ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ యాప్‌ను ర‌ద్దు చేశారు. 
 
పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌ల‌ను త‌గ్గిచేందుకు ఎడిటింగ్ ఫీచ‌ర్ల‌ను డిజైబుల్ చేశారు. గ‌తంలో పోస్టు చేసిన మెసేజ్‌ల‌ను ఎడిట్ చేసి ఆప్ష‌న్ ప్ర‌స్తుతం 30వ తేదీ వ‌ర‌కు బ్లాక్ చేశారు. పేప‌ర్ లీకేజీల‌కు పాల్ప‌డుతున్న చీటింగ్ ముఠాలు టెలిగ్రాం యాప్‌ను విరివిగా వాడుతున్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. నీట్ ప‌రీక్ష రాస్తున్న అభ్య‌ర్థుల‌ను ఆ చీటింగ్ ముఠా టార్గెట్ చేస్తోంది.
 
ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. పేప‌ర్ లీకేల‌కు చెందిన అనేక ఛాన‌ళ్ల‌ను, గ్రూపుల‌ను ఇప్ప‌టికే ప్ర‌భుత్వం తొల‌గించింది. ఈ నిర్ణయం వల్ల టెలిగ్రామ్‌ను ఉపయోగించే లక్షలాది మంది యూజర్లకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎన్​టీఏ తెలిపింది. జూన్ 30వరకు ‘మెసేజ్-ఎడిటింగ్’ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని టెలిగ్రామ్‌ను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. 
 
గతంలో అడ్మినిస్ట్రేటర్లు అంతకుముందు పోస్ట్ చేసిన సందేశాలను ఎడిట్ చేయడానికి, అటాచ్ చేసిన ఫైళ్లను మార్చినప్పటికీ టైమ్‌స్టాంప్ అలాగే ఉండేలా చేయడానికి ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేశారని, తద్వారా పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలను సృష్టించారని తెలిపింది. నీట్ అభ్యర్థులను మోసగించడానికి చీటింగ్ రాకెట్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను వ్యవస్థీకృతంగా వినియోగిస్తుండటానికి ప్రతిస్పందనగా శాంతిభద్రతల పరిరక్షణ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.