ఆలస్యమైన ‘నైరుతి’ ఉన్నట్టుండి కనుమరుగయ్యిందా?

ఆలస్యమైన ‘నైరుతి’ ఉన్నట్టుండి కనుమరుగయ్యిందా?
సూపర్‌ ఎల్‌నిలో ప్రభావంతో ఇప్పటికే ఆలస్యమైన ‘నైరుతి’ ఉన్నట్టుండి కనుమరుగయ్యిందా? దేశమంతటా రుతు పవనాలు విస్తరించినప్పటికీ, వానలు లేకపోవడానికి కారణమేంటీ? భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం విడుదల చేసిన తాజా ఉపగ్రహ చిత్రాలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఉపగ్రహ చిత్రాల్లో ఉన్నట్టుండి కనుమరుగయ్యినట్టు ఐఎండీ పేర్కొంది.
ఈ కారణంగానే ఈ నెల 4వ తేదీ నుంచి సోమవారం వరకూ దేశ వ్యాప్తంగా సగటున 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్టు వెల్లడించింది. లోటువర్షపాతం 64 శాతంగా రికార్డయ్యినట్టు వివరించింది.  దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ, సమృద్ధిగా వానలు లేకపోవడానికి తూర్పు-పశ్చిమ పవనాలు ఢీకొనడమే కారణమని ఐఎండీ తెలిపింది.
తూర్పు నుంచి వచ్చే పవనాలు (ఈస్టర్లీ జెట్‌) మేఘాలను తాకడం వల్ల నైరుతి సమయంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల ఎత్తులో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే, ఉన్నట్టుండి పశ్చిమం దిశ నుంచి అత్యంత వేగంగా వచ్చిన పవనాలు (వెస్టర్లీ జెట్‌ స్ట్రీమ్‌) ఈస్టర్లీ జెట్‌ను ఢీకొట్టడంతో మేఘాలు ఏర్పడటం ఆగిపోయిందని, ఈ కారణంగానే సరైన వానలు పడట్లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

నైరుతి ప్రవేశించి పది రోజులు గడుస్తున్నప్పటికీ, దేశంలో సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైనట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైరుతిలో ఈ స్తబ్దత మరో వారం పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పులు జరిగి 22వ తేదీ నాటికి వానలు సాధారణ స్థితికి చేరవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జూన్‌ 15న ఇన్సాట్‌ -3డీఎస్‌ ద్వారా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో చురుకైన రుతుపవనాలకు సాధారణంగా ఉండే విసృ్తతమైన మేఘాల ఆవరణకు భిన్నంగా, నిర్మలంగా కనిపిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. హిమాలయాలు, ఈశాన్య భారతదేశం, సింధు-గంగా మైదానాలకు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లోనే ప్రధానంగా మేఘాల కదలికలు కనిపిస్తుండగా, అరేబియా సముద్ర శాఖ మాత్రం బలహీనంగా, విడిపోయినట్టుగా కనిపిస్తున్నదని తెలిపారు.

ఇదిలా ఉండగా తెలంగాణాలో 11 జిల్లాల్లో సోమవారం 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 42.5 డిగ్రీలు నమోదైనట్టు పేర్కొన్నారు.  ముఖ్యంగా ఈనెల 18 నుంచి 21 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్‌ జారీ చేసింది.